7, డిసెంబర్ 2011, బుధవారం

వైఎస్ కుటుంబాన్ని గౌరవించేందుకే అలా చేశా: బొత్స

వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని సంతకాలు పెట్టించామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తొలిసారి అంగీకరించారు. ఆ కుటుంబాన్ని గౌరవించాలని చేసిన ఆ పని తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తప్పని తాను అనుకోవడంలేదన్నారు. ఆనాటి పరిస్థితుల్లో సంతకం పెట్టామని, అయితే చివరకు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండాలనుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ భయపడబోదని, గెల్చుకొనే ప్రయత్నం చేస్తామని స్పష్టంచేశారు. ఆయన బుధవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తనపై చేసిన విమర్శలను ఖండించారు. అవిశ్వాసం సందర్భంగా తాము పార్టీనుంచి వెళ్లిపోయేలా పొగపెట్టారని వైఎస్ విజయమ్మ అనడం వల్లనే తాను స్పందించానని వివరించారు. ఎమ్మెల్యేలను డబ్బుతో కొంటున్నామని, ప్రలోభపెడుతున్నామని వైఎస్ జగన్ ఆరోపించడం అవాస్తవమని, తమ ఎమ్మెల్యేలను తాము కొనాల్సిన పనేముంద ని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌వైపు వచ్చేలా కొనే అవసరం జగన్‌కే ఉంటుందని విమర్శించారు. పాయకరావుపేటలో ఎలా తిరుగుతావో చూస్తానని తాను బెదిరించానని ఎమ్మెల్యే బాబూరావుతో తనపై, మరికొందరితో ఇతర మంత్రులపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆరోపణలు చేయించడం చిన్నపిల్లల చేష్టగా ఉందని ఎద్దేవాచేశారు. తాను అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తానని బాబూరావు అంటే... పాయకరావుపేటలో ఉప ఎన్నికల్లో తేల్చుకుందామని అన్నానని వివరించారు. సీబీఐ విచారణ చేయిస్తామని సుచరిత భర్తను బెదిరించామనడమూ సరికాదన్నారు.

 

 తప్పుచేసే వారే అలా భయపడతారని, తప్పులేనప్పుడు సీబీఐ విచారణ ప్రస్తావనకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. విప్ వ్యతిరేకించిన వారిపై తప్పనిసరిగా వేటుపడుతుందని స్పష్టంచేశారు. వారిపై పిటిషన్ వ్యవహారం సీఎం, విప్ చూస్తారన్నారు. ఉప ఎన్నికలకు కాంగ్రెస్ భయపడదని, అన్ని స్థానాలనూ గెల్చుకుంటుందని చెప్పారు. ''అసెంబ్లీలో కరువుపై అవిశ్వాసాన్ని చంద్రబాబు పెట్టారు. అంతకుముందు కరువుపై చర్చ జరిగితే ఆయన కనీసం అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు. అవిశ్వాసంలో రాజకీయలబ్ధి కోసం ఆలోచిస్తూ కూర్చున్నారు. ఓదార్పు యాత్రలో రైతుల కష్టాలు చూశానని చెబుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా కరువుపై చర్చలో తనపార్టీ పాల్గొనేటట్లు చేయలేదు. వీరికి రాజకీయంగా లబ్ధి పొందాలని తప్ప రాష్ట్ర రైతులపై చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తార్కాణం''అని బొత్స విమర్శించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి