ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌పై ప్రవేశపెట్టిన 'అవిశ్వాస తీర్మానం' రాష్ట్ర ప్రజల్లో రాజ కీయ నాయకులపైనే కాకుండా, ప్రజాస్వామ్య విలువల పేరుతో రాజకీయాల్లో కొనసాగుతున్న 'కుహనా' మేధావులపై కూడా ఒక స్పష్టమైన అవగాహన కల్పించింది. సాధారణంగా భారత రాజకీయాలపైనా, ప్రధానంగా ఎన్నికలపై విద్యావంతులు పెద్దగా ఆసక్తి కనబరచరన్న విమర్శ ఉంది. దాంతో 30 నుంచి 40 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోతున్నారన్నది వాస్తవం. వీరిలో దాదాపు 30 శాతం మంది విద్యావంతులే కావడం గమనార్హం. విద్యావంతులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోవడమన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు, పరిపూర్ణతకు నష్టమే. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే అంశంపై రాష్ట్ర ప్రజలను చైతన్యవ ంతులను చేసేందుకు 'లోక్‌సత్తాపార్టీ'ని ప్రారంభించి రాజకీయ అరంగేట్రం చేసిన 'ప్రజాస్వామ్య మేధావి' జయప్రకాశ్ నారాయణ్, ఆ దిశగా ఎంతో కొంత విజయాన్ని సాధించారనే చెప్పాలి.
ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల సత్తాను చాటగలిగిన 'ఓటు హక్కు'ను వృథాచేయకుండా, ప్రజాస్వామిక విలువలను గౌరవించి ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిన అభ్యర్థులకు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు జేపీ పిలుపునివ్వడం అందరికీ గుర్తుండే ఉంటుంది. జేపీ పిలుపుతో నాలాంటి ఎందరో యువకులూ, విద్యావంతులూ ప్రభావితమై ఓటు హక్కును వినియోగించుకున్నారన్నది కూడా మరువలేని వాస్తవం. ఆ ఎన్నికల్లో లోక్‌సత్తా ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయినా ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలపై లోతైన అవగాహన ఉన్న జేపీ ఎన్నికకావడంతో, అసెంబ్లీలో ఆచరణాత్మకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి పట్టంకడతారని ఎందరో ఆశించారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన 'ఓటింగ్'లో పాల్గొనకుండా 'తటస్థవాదాన్ని' ఆశ్రయించి ప్రజాస్వామ్యాన్ని 'గోడమీద పిల్లి' స్థాయికి దిగజార్చడం, ఎందరినో దిగ్భ్రమకు గురిచేసింది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా 'అవిశ్వాసాన్ని' ప్రకటించడం ప్రజాస్వామిక మౌలిక సూత్రాల్లో ఒకటన్నది జేపీ వంటి 'మేధావి'కి తెలియదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న చావుబతుకుల సమస్యల మీద ప్రభుత్వాన్ని నిల దీయడానికి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో, ప్రభుత్వ తీరుతెన్నులను విమర్శించిన జేపీ, తదనంతరం జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకుండా 'పలాయనం' చిత్తగించడం, ఏ ప్రజాస్వామ్య విలువల ప్రస్థానానికో రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ''దేశద్రోహుల చేతల కన్నా, బుద్ధిజీవుల మౌనం జాతికి మరింత ప్రమాదకరం'' అన్న లోకోక్తి ప్రస్తుత సన్నివేశంలో జేపీ ఆచరణకు అద్దం పడుతున్నది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు, విద్యావంతులకు ప్రజాస్వామ్య సూత్రాలనూ, విలువలనూ బోధించడమే 'రాజకీయ వృత్తి' గా స్వీకరించిన 'ప్రజాస్వామ్య మేధావి' జయప్రకాశ్ నారాయణ్, చివరకు అధికార రాజకీయాల ముందు మోకరిల్లి 'తోకాడించడం' విచారకరమైనదేకాక, ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలి పెట్టు!
-పి.నగేష్ ఇంజనీర్, హైదరాబాద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి