తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపి వేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐతో పాటు ఇతర సంస్థల విచారణను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది. మంగళవారం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు, చంద్రబాబు, రిలయన్స్ తరఫు న్యాయవాదులు వాదించారు. అంతకుముందు సోమవారం పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ తరఫు లాయరు తన వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేస్తూ, దర్యాఫ్తు తాత్కాలికంగా నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు రిలయన్స్ తరఫు లాయర్ విజయమ్మ పిల్‌లో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవని కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో మాత్రమే వేశారని వాదించారు. ప్రాథమిక ఆధారాలు లేనందున విచారణ నిలిపి వేయాలని కోర్టును కోరారు. రిలయన్స్ ఎపిలో భారీగా పెట్టుబడులు పెట్టిందని ఇందులో రాజకీయాలకు తావులేదన్నారు. కెజి బేసిన్ ఎపిలోనే ఉందన్నారు. పిటిషనర్ కోర్టుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారని వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. సిబిఐ విచారణ జరిపితే తమ క్లయింటుకు నోటీసులు జారీ చేయడం, తాము బిఎస్ఈకి జవాబు చెప్పుకోవడం తమ షేర్లు నష్ట పోవడం జరుగుతుందని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ తర్వాత ఏం చేసినా కంపెనీకి ప్రయోజనం ఉండదన్నారు.
తమ కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటే లక్షల మంది రోడ్లపై పడతారన్నారు. విచారణ ఆదేశాలు రీకాల్ చేయాలన్నారు. కోర్టును రాజకీయ యుద్ధాలకు వాడుకోవద్దన్నారు. రామోజీ గ్రూపులో తమ కంపెనీ పెట్టుబడులు పెడితే తప్పేమిటన్నారు. మాకు నోటీసులు కూడా ఇవ్వకుండా అంత తొందరగా విచారణ జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని బాబు తరఫు న్యాయవాది వాదించారు. వైయస్ ఎమ్మెల్యేగా, సిఎంగా ఉన్నప్పుడు ఏం చేశారన్నారు. కాగా బుధవారం వైయస్ విజయమ్మ వాదనలు విన్న అనంతరం కోర్టు తుది తీర్పు వెల్లడించే అవకాశముంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి