అంచనాల్లో రాజకీయవర్గాలు తెలంగాణ సెంటిమెంట్‌తో కాంగ్రెస్, టిడిపిలు సతమతం ప్రధానంగా సీమాంధ్రపైనే ఆశలు ప్రధాన పక్షాల ఓటుబ్యాంకుకు వైఎస్సార్ కాంగ్రెస్ చిల్లు
రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు రిహార్సల్స్‌గా మినీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం దాదాపు సిద్ధమైంది. ఉప ఎన్నికల పోరులో పోటీ ప్రధానంగా ఏయే పార్టీల మధ్య ఉంటుంది? కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌ల మధ్య జరిగే పోరు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందా? లేక మూడో స్థానానికి దిగజారుస్తుందా? ప్రధాన పక్షాల సంప్రదాయ ఓటు బ్యాంకు పరిస్థితి ఏమిటి? తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమెంత? ప్రస్తుతం రాజకీయ వర్గాల మధ్య ఈ అంశాలపైనే చర్చలు సాగుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలపై భవిష్యత్ ఆధారపడి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు వీటిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
ఉప ఎన్నికలు సీమాంధ్రలో ఒక రకంగా, తెలంగాణలో మరోరకంగాను ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఉద్యమం కొంత చల్లారినా, సెంటిమెంటు ఇప్పటికీ బలంగానే కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. అధికారం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ కొంత ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి అలాంటి ఆశలేవీ కనిపించడం లేదు. తెలంగాణలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనుండగా, వీటిలో మూడింటిని కాంగ్రెస్, మూడింటిని తెలుగుదేశం పార్టీలు గత ఎన్నికల్లో గెలుచుకున్నాయి. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇక జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు తెలంగాణలో ఈ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కని విధంగా ఉంది. తెలంగాణలో జగన్ ఇంతవరకు ఓదార్పు యాత్రను కూడా నిర్వహించలేదు. వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్ర ముందుగానే హింసాత్మకంగా మారడంతో రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో జగన్ పార్టీ బలాన్ని అంచనా వేయడానికి ఒక కొలబద్ద అంటూ ఏదీ లేదు. కడప, పులివెందుల స్థానాల్లో జగన్, ఆయన తల్లి విజయమ్మ గెలుపొందినపుడు సీమాంధ్రలో కన్నా తెలంగాణలోనే విజయోత్సవాలు బాగా జరిగాయి. తెలంగాణలో కూడా జగన్ పార్టీకి, వైఎస్‌కు అభిమానులు ఉన్నప్పటికీ వారు విజయాన్ని తెచ్చిపెట్టగలరా? అన్నదే ప్రశ్న. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అయితే మిగిలిన స్థానాల్లో జగన్ తన అభ్యర్థులను పోటీకి నిలబెడతారా? లేదా? అన్నది ఇంకా కచ్చితంగా తేలలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరఫున గెలిచిన నలుగురు ఈ ఉప ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేయనున్నారు. తెలుగుదేశం తరఫున గత ఎన్నికల్లో గెలుపొందిన నాగం జనార్దన్‌రెడ్డి ఇండిపెండెంట్‌గాను, కాంగ్రెస్ తరఫున గెలిచిన కొండా సురేఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ స్థానంలో ఇండిపెండెంట్‌గా గెలుపొందిన రాజేశ్వర్‌రెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబీకులు ఎవరైనా పోటీ చేసేట్లయితే తాము పోటీ పెట్టకూడదని తెరాస సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇక్కడ ఎలాగూ పోటీ చేస్తాయి. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నందున తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో తెరాసదే పైచేయిగా ఉండొచ్చు. రెండోస్థానంలో ఏ పార్టీ ఉంటుందన్నదే ఆసక్తిగా మారింది,
సీమాంధ్రలో..
సీమాంధ్రలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఏడు స్థానాలు రాయలసీమలో, పది స్థానాలు కోస్తా ప్రాంతంలో ఉన్నాయి. తెలంగాణలో అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సీమాంధ్ర స్థానాల పైనే ఆశలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ చీలిస్తే తమకు ప్రయోజనం కలుగుతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇదే విధమైన అంచనాలు వేయగా డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సాంప్రదాయ ఓటర్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉంది. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కాంగ్రెస్‌కు, బీసీ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తూంటారు. ఈ ఓటర్లలో వైఎస్ పట్ల అభిమానం ఎక్కువగా ఉండటం వల్ల ఉప ఎన్నికల్లో వారు జగన్ పార్టీకి ఓటు వేసినట్లయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చిక్కుల్లో పడాల్సి వస్తుంది. సీమాంధ్ర ప్రాంతంలో జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రలకు ప్రజలనుంచి కనిపించిన స్పందనను బట్టి తమ అభ్యర్థుల విజయానికి తిరుగు ఉండదన్న ధీమాతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. అయితే పోటీ ప్రధానంగా ఏయే పార్టీల మధ్య ఉంటుంది? మూడో స్థానంలోకి ఏ పార్టీ పడిపోతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి