13, డిసెంబర్ 2011, మంగళవారం

సినిమా హిట్ వెనుక ‘నాలుగో సింహం’

మామిడి హరికృష్ణ,

''ఒక సినిమా సూపర్‌హిట్ కావాలంటే ఏం ఉండాలి?''
-
మంచి కథ ఉండాలి.
-
పెద్ద హీరో కావాలి.
-
ఆకట్టుకునే 'టేకింగ్' ఉండాలి...
ఇంతకాలం సినీ పండితులు, విశే్లషకులు అందరూ సినిమా విజయ సూత్రాలుగా చెప్తున్న కారణాలు ఇవి... కానీ కొంచెం లోతుగా తరచి చూస్తే సినిమాల సక్సెస్‌కు పైకి కనిపించే కారణాలు, కారకాలు ఇవే అయినప్పటికీ, అండర్ కరెంట్‌గా ఉండే మరో కోణం కూడా ఉందని చెప్పాలి...
ఆ నాలుగో సింహమే ''సంక్షోభ సమయం...''!
సంక్షోభమా? ఇదేంటి? సినిమా విజయానికి- ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కారణాలుంటాయి కానీ, సినిమాయేతరమైన కారణాలు సినిమా సక్సెస్‌కు దోహదపడతాయా? అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు... చరిత్ర చెప్తున్న పాఠాలను, మనకు ఎదురైన అనుభవాలను ఒక్కసారి ఈ కోణంనుంచి పరిశీలిస్తే ''సంక్షోభ సమయాలు సినిమాల విజయానికి దారితీస్తాయ''నే మాటల్లోని వాస్తవం అర్థం కాకమానదు...
'
దూకుడు' సమయం:
తెలుగులో ప్రతియేటా దాదాపు 120 నుండి 140 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి... వాటిలో ఎంత లేదన్నా ఓ 8 సినిమాలు హిట్ అవడం సాధారణం. వీటి హిట్‌కు పై మూడు కారణాలతోపాటు మరేవైనా సినిమా రంగానికి సంబంధించిన 'ఈక్వేషన్స్' కలిసి సినిమాల సక్సెస్‌కు దారితీయడం జరుగుతోంది. కానీ అనూహ్యమైన ప్రజాదరణతో, బాక్సాఫీసు కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు విడుదలైన ''సమయాన్ని'' గమనిస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడవుతాయి. నాటి 'సమయాలే' ఆయా సినిమాల అద్భుత విజయానికి పైకి కనిపించని కారణంగా కూడా మారాయని కూడా అవగతం అవుతుంది.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమా చరిత్రలోనే అద్భుత విజయాన్ని సాధించిన సినిమాగా రికార్డులకు, వివాదాలకు దారితీసిన సినిమా - ''దూకుడు''! 'కథ- హీరో- టేకింగ్'అనే విషయాలను పక్కనబెడితే ఈ సినిమా విడుదలైనప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను, అప్పటి సమయాలను గమనిస్తే, ఆ సమయం రాష్టవ్య్రాప్తంగా సంక్షోభ కాలం 'పీక్'స్థాయిలో ఉందని ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఆకాశాన్నంటుతున్న సమయమది. తెలంగాణా ఏర్పాటు అవుతుందా? లేదా? అనే 'ఏకాంశం'పై అటు సీమాంధ్ర ప్రాంతంలోనూ, ఇటు తెలంగాణా ప్రాంతంలోను అంచనాలు- సస్పెన్స్ తీవ్రంగా ఉన్న సమయమది. పరిపాలన ప్రజాజీవనం అంతా స్థంభించిపోయి ఒకలాంటి స్తబ్ద వాతావరణం అన్ని రంగాలలోనూ విస్తరించిన సమయమది... ఒక్క మాటలో చెప్పాలంటే 'సామాజిక సంక్షోభం' తారస్థాయికి చేరిన కాలం అది...
ఇలాంటి 'సమయం'లో 'దూకుడు' సినిమా వచ్చింది.. మన సంప్రదాయ సినీ పండితులు, విశే్లషకులు ఈ సమయాన్ని సినిమాలకి ''ప్రతికూల సమయం''గా పరిగణించారు... ఈ టైమ్‌లో సినిమాలు రిలీజ్ చేయడం సాహసమే అనీ, వృథా అని కూడా అన్నారు.
కానీ వీరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఆ సినిమా...
సూపర్ డూపర్ హిట్ అయింది... కలెక్షన్ అయిన మొత్తం డబ్బులలో వివాదం ఉన్నప్పటికీ, వాస్తవానికి 'దూకుడు' సినిమా స్థాయికి మించిన కలెక్షన్లు ఆ సినిమాకు వచ్చాయి... ఈ ''్ఫనామెనా''పై చర్చించిన మేధావులంతా ఏవేవో కారణాలు చెప్పారు. ఆ సినిమాలోని మరెన్నో '్ఫ్యక్టర్స్'ని కారణాలు చూపించారు. కానీ నిజానికి సినిమాయేతరమైన సామాజిక సంక్షోభం ఈ సినిమా అనూహ్య విజయానికి కారణమనే విషయాన్ని గమనించలేకపోయారు...
సంక్షోభం సినిమాలకి ప్లస్ అవుతుందా?
ఈ ప్రశ్నకి సమాధానం అవుననే చెప్పాలి...! ఈ అనూహ్య పరిణామాన్ని విశే్లషించాలంటే సైకాలజీ సూత్రాలను కూడా ఇక్కడ ఉదహరించడం అవసరం. ఆ లెక్కన, సినిమా అనేది సాధారణంగా ఓ ''సైకలాజికల్ గేమ్ ప్లే''అని చెప్పాలి. ప్రేక్షకులలోని భావోద్వేగాలు ఇన్‌స్టింక్ట్స్‌తో ఆడుకునే కళాత్మక క్రీడ- సినిమా! సినిమాలోని పాత్రలు- క్యారెక్టరైజేషన్- కథ- దానిలోని సన్నివేశాలు వంటి వాటిద్వారా ప్రేక్షకులలోని ''అడ్రినలిన్'' వంటి హార్మోన్‌లను ఉత్తేజితం చేయడం, ఆ ఉత్తేజంనుంచి వచ్చిన అనుభూతితో ప్రేక్షకులు ఆనందాన్ని- రిలీఫ్‌ని పొందుతారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎనె్నన్నో మనోవైజ్ఞానిక పరిశోధనలు రుజువు చేస్తున్నవి. స్టాన్‌ఫోర్డ్, ఒహియో యూనివర్సిటీలలో సినిమాని చూస్తున్నప్పుడు వ్యక్తులలో జరిగే సంచలనాలు, పరిణామాలను అత్యంత ఆధునిక యంత్ర పరికరాలతో సైతం రికార్డు చేసారు. వివిధ 'జెనర్' సినిమాలను చూస్తున్నప్పుడు (అంటే హారర్, యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ వంటివి) వ్యక్తులలోని శ్వాస స్థాయి, గుండె కొట్టుకునే వేగం, మెదడు పనిచేసే వేగం, శారీరక మార్పులు వంటి వేర్వేరుగా ఉంటాయని ఈ రీసెర్చ్‌లు తెలియచేస్తున్నాయి. అలాగే ఒకే సినిమా చూస్తున్నప్పుడు అందులోని వేర్వేరు సన్నివేశాల (కామెడీ, ఫైట్ సీక్వెన్స్, పాటలు, ఛెజింగ్ వంటివి) సమయంలో ప్రేక్షకులలోని శారీరక- మానసిక ప్రతిస్పందనలు (రెస్పాన్స్‌లు), ప్రచోదనలు (ఇంపల్స్‌లు) వేర్వేరుగా ఉంటాయని కూడా వెల్లడయింది. ఇలాంటి ప్రతిస్పందనా గుణాన్ని కలిగి ఉన్న ప్రేక్షకులు ఆయా సినిమాలకు స్పందించే స్వభావమే ఆ సినిమాల జయాపజయాలను నిర్ణయిస్తున్నాయని చెప్పాలి... అంటే, సినిమాని చూస్తున్నప్పుడు ప్రేక్షకులలో కలిగే ''సైకలాజికల్ కెమిస్ట్రీ''యే దీనిని నిర్ధారిస్తున్నదన్నమాట...
అలాగే, సినిమా థియేటర్‌కు బయట మనిషి ఎనె్నన్నో సంక్షోభాలను ఎదుర్కోవడం కూడా సహజమే... వ్యక్తిగతంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా సంభవించే పరిణామాలు మనుషులలో రకరకాల సంక్షుభిత స్థితులకు కారణమవుతున్నాయి. అలాంటి సంక్షోభ సమయాలలో మనిషి మనసు తననితాను 'డిఫెన్స్ మెకానిజమ్'లో రక్షించుకోవడంకోసం ఓ ''ఎస్కేప్ మెకానిజమ్''ని కోరుకుంటుంది... మనిషిలోని ఈ అంతర్గత వాంఛని, అవసరాన్ని, అచేతన కాంక్షని ''సాటిస్‌ఫై'' చేయడంలో సినిమా మాధ్యమం ఎదురుగా కనిపిస్తుంది. దాంతో సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్న - '్ఫల్' అవుతున్న వ్యక్తులు- సమాజాలు అన్నీ ఆ సమయాల్లో సినిమాల ద్వారా ఓ రకమైన 'సోలేస్' (స్వాంతన)ని పొందుతాయి. అదే చివరికి ఆ సినిమాల సూపర్ సక్సెస్‌కు దారితీస్తాయి. 'దూకుడు' విషయంలో జరిగింది కూడా ఇదే అనే విషయాన్ని 'గెస్టాల్టిక్'గా ఆలోచిస్తే అర్థమవుతుందని చెప్పాలి.
ఇంతకుముందు కూడా...
అసలు సినిమాలు అంటేనే మనలోని ఎస్కేపిస్టు ధోరణులకు తెర రూపాలు... మన రియల్ లైఫ్‌లో మనం చేయలేని ఎన్నో కాంక్షలు- కోరికలు- పనులు తెరమీది హీరోల పనులలో చూసి ''ఐడెంటిఫై'' చేసుకుని సంతృప్తిపడటం కామన్... దీనినే సైకాలజీలో ''ప్రత్యామ్నాయ తృప్తీకరణ విధానం'' (సబ్‌సిటిట్యూట్ గ్రాటిఫికేషన్) అంటారు... సినిమాల సక్సెస్‌కు ఇదే అసలు కారణం అని కొమ్ములు తిరిగిన సినీ దర్శకులు- మేధావులకు కూడా తెలిసి ఉండకపోవచ్చు... కానీ నిజానికి జరిగేదదే!
అలాగే, ఓ వ్యక్తి 'డిస్టర్బ్'గా ఉన్నపుడు, 'డిస్టెర్బెన్స్'కు కారణమైన అంశాల్ని అధిగమించడానికి వినోదాన్ని కోరుకోవడం సహజం... ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్- హ్యాంగోవర్ వంటి సమస్యలు లేకుండా జనాలకు వినోదాన్ని అందించేది సినిమానే! అందుకే, సామాజిక సంక్షోభాలు- అలజడుల కాలంలో మనుషులంతా అనివార్యంగా 'వినోదం'వైపే మొగ్గు చూపుతారు. ఆ క్రమంలో, వారి 'వినోదకాంక్ష'ని 'ఎంటర్‌టైన్‌మెంట్ దాహాన్ని' తీర్చగలిగిన సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ అదే సినిమా మరో సాధారణ పరిస్థితులు- సమయాలలో కనుక రిలీజ్ అయితే, కథ- హీరో- టేకింగ్ వంటివి ఎంత బాగున్నప్పటికీ మామూలు హిట్ అవుతుంది కానీ సంచలన హిట్ మాత్రం కాదు అనేది ఇక్కడ గుర్తించాలి...
'్ఫనామెనా'ను రుజువుచేయడానికి మనకు గతంలో ఎనె్నన్నో ఉదాహరణలున్నాయి... ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సంక్షోభ స్థితిలో చిక్కుకున్న సందర్భం- 1929నుండి 1932వరకూ ఉన్న ''ఆర్థిక మాంద్యం''! ఈ సమయంలో నాటకాలు- సినిమాలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అంతకుముందుకన్నా అత్యధిక సంఖ్యలో జనాలు సినిమాలకు వెళ్లారు. దీన్ని గమనించిన సినిమా స్టూడియోలు అప్పట్లో ఎక్కువ సినిమాలను, సినిమా టెక్నాలజీలలో కొత్త సాకేతికతను పరిచయం చేసాయి... అలాగే రెండవ ప్రపంచ యుద్ధ (1939-45) కాలంలో కూడా యూరప్, అమెరికా, రష్యాలలో జరిగిందదే...! అసలు రష్యాలో అత్యధిక సంఖ్యలో సినిమాలు, సినిమా హాళ్లు రావడానికి కారణాలలో ఇది కూడా ఒకటనే విషయాన్ని కాదనలేము. అలాగే జపాన్‌లో సినిమా టెక్నాలజీ- టేకింగ్‌లో నవ్య ధోరణులకు కారణం కూడా పరోక్షంగా ఈ యుద్ధం తాలూకు సంక్షోభమే అని చెప్పాలి.
మూడేళ్ళ క్రితం భారత్-చైనా మినహా ప్రపంచాన్ని అంతా ముంచేసిన సంక్షోభం 'రిసెషన్'! దీనివల్ల ఎన్నో బడా కంపెనీలు మూతపడ్డాయి. కోట్లాది ప్రజలు నిరుద్యోగులయ్యారు. అంతటా ''పింక్ స్లిప్ ఫోబియా'' (ఉద్యోగాల లోంచి తీసివేసే కార్యక్రమం) అలుముకుంది. ఈ సంక్షోభ సమయంలో హాలీవుడ్‌లో వచ్చిన సినిమాలలో అత్యధిక సినిమాలు సూపర్ సక్సెస్‌ని సాధించాయి... 'అవతార్' సినిమా అద్భుత విజయమే దీనికి మంచి ఉదాహరణ...
కొసమెరుపు: మన ఇండస్ట్రీలో సినిమా హిట్ అయినప్పుడు వినిపించే సాధారణ కామెంట్- ''టైమ్‌రాటైము''! అనేది... ఇంత విశే్లషణ ఏమీ లేకుండానే మనం చెప్పే 'టైమ్'అనే మాటలో స్పష్టంగా ఉన్న అంశమే ఈ ఈ ''సంక్షోభ సమయం''అని ఇప్పుడు అర్ధంచేసుకోవాలి. అందుకని ఇకనుండి, మన దర్శక- నిర్మాతలు ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు బెదిరిపోకుండా ఈ ఉత్సాహంతో సినిమాలు రిలీజ్ చేయాలి... హిట్స్ సూపర్‌హిట్‌గా మల్చుకోవాలి... అదే సమయంలో ఈ 'నాలుగో సింహం' ఉంది కదా అని మిగతా మూడు సింహాలను మాత్రం విస్మరించకూడదు... అపుడు సంక్షోభం- సినిమా ఇండస్ట్రీ పాలిట వరంగా మారే అవకాశం ఉంది.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి