ఈ మధ్య న్యూయార్క్ టైమ్స్‌లో ఒక వార్త ప్రచురితమైంది. మామూలు వార్తే అయితే దాన్ని ఎవరూ ముఖ్యంగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్య్రానికి అత్యంత ప్రాధాన్యత నిస్తామని సగర్వంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ దినపత్రిక ప్రచురించిన వార్తకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇతర ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను సెన్సార్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నదనేదే ఆ వార్త సారాంశం. కేంద్ర మంత్రి కపిల్ సిబల్.. మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గూగుల్, యూహూ వంటి సోషల్ మీడియా దిగ్గజాలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లను పిలిచి, భారత్ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే, రెచ్చగొట్టే తీరున ఉండే అంశాలను పరిశీలించి, ఆన్‌లైన్‌లో పెట్టకుండా ఆపేయాలని విజ్ఞప్తి చేసారని కూడా అది వివరించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న మనదేశంలో ఈ వార్త సహజంగానే దుమారం లేపింది. అంతేకాదు మన సమాజంలో వాక్‌స్వాతంత్య్రం అమలవుతున్న తీరుపై తక్షణం చర్చించి సమాధానాలు కనుకొనాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అక్కడ కపిల్ సిబల్ ఏమన్నారు? సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లు ఏం విన్నారు..? అనే అంశాల మాట అట్లా వుంచితే ఇంటర్నెట్ నుంచి మాత్రం మంత్రివర్యుల మీద నిప్పుల వర్షమే కురిసింది. అసలు తానేమన్నదీ చెప్పుకొనేందుకు కూడా కపిల్ సిబల్‌కు ఎటువంటి అవకాశమివ్వని రీతిలో విమర్శల వరద వెల్లువెత్తింది. ఫేస్‌బుక్ పేజీలన్నీ సిబల్‌పై ఖండనలతోనే నిండిపోయాయి. ఇక వెబ్-బోర్డుల్లో వచ్చిన అడ్డూ అదుపూలేని దూషణలతో కూడిన విమర్శలు మంత్రి, అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వానికి ఊపిరిసలపనివ్వలేదు.
వాక్‌స్వాతంత్య్రం అవసరమే. అందులో ఏమాత్రం సందేహంలేదు. దానె్నవ్వరూ ఖండించడానికి వీల్లేదు. మీడియాలో సెన్సార్‌షిప్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కానీ ఇదే సమయంలో... స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని అవకాశంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు, అడ్డదిడ్డంగా రాయడం ఎంతవరకు సమర్థనీయం? ప్రజాస్వామ్య హితైషులు కూడా దీన్ని హర్షించగలరా? వాక్‌స్వాతంత్య్రం ప్రజాస్వామ్య నిర్మాణాన్ని గట్టిగా బంధించి వుంచే కాంక్రీటు వంటిదనే సత్యాన్ని మనమెవరం కాదనలేం. అంతేకాదు కేవలం ఈ వాక్‌స్వాతంత్య్రమే ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా చేస్తుంది. ఇదే సమయంలో ప్రజలు తమగురించి ఏమనుకుంటున్నారనే దానిపై రాజకీయ నాయకులకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల సెన్సార్‌షిప్ అనేది అటు పాలకులకు, ఇటు పాలితులకు..ఇద్దరికీ క్షేమదాయకం కాదు.
వాక్‌స్వాతంత్య్రం సర్వజనామోదమైనప్పటికీ, దాన్ని వినియోగించుకొనే సమయంలో ప్రతి సమాజం దానికి కొన్ని అర్థవంతమైన పరిమితులున్నాయన్న సత్యాన్ని గుర్తించింది. ఈ పరిమితులన్నీ సామూహిక ప్రయోజనాలకు సంబంధించినవి కావడం గమనార్హం. ముఖ్యంగా ఒక వ్యక్తి తన వాక్‌స్వాతంత్య్రాన్ని వినియోగించుకోవడం ద్వారా సమాజంలో ఎంతమంది వ్యక్తులకు నష్టం చేకూరుస్తున్నాడనే అంశంపై ఈ పరిమితి ఆధారపడి వుంటుంది. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛ కారణంగా సమాజం ఎక్కువగా నష్టపోతున్నప్పుడు తప్పనిసరిగా అతడికి పరిమితులు విధించాల్సిందే. అమెరికాకు చెందిన జస్టిస్ ఒలివర్ వెండెల్ హోమ్స్ వాక్ స్వాతంత్య్రంపై చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. 'వాక్‌స్వాతంత్య్రమంటే ప్రేక్షకులతో కిక్కిరిసిన నాటక ప్రదర్శనశాలలో ఒక్కసారిగా 'మంటలు' అంటూ అరిస్తే ఎట్లా ఉంటుంది?' (అదే జరిగితే ఒక్కసారిగా తొక్కిసలాట జరుగుతుంది. ఒకళ్ళపై ఒకళ్ళు పడిపోతారు, గందరగోళం చెలరేగుతుంది. ఇందులో కొందరు మరణిస్తే మరికొందరు గాయపడతారు. ఇక ధియేటర్ ఆస్తి గురించి చెప్పాల్సిన పనే లేదు. మొత్తం సర్వనాశనమవుతుంది. మరి ఇంతటి నష్టానికి కారణమేంటి? కేవలం ఒక వ్యక్తికున్న చిత్తానుసారం మాట్లాడే హక్కు!)
విభిన్న సమాజాలు వివిధ రకాలైన సాంస్కృతిక, రాజకీయ సంప్రదాయాలను కలిగివుండటం సహజం. స్వేచ్ఛ అనేది విశ్వజనీన హక్కు అని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కుదించడానికి వీల్లేదంటూ, స్వేచ్ఛావాక్కు సమర్ధకులు గట్టిగా వాదిస్తుంటారు. కానీ వారెంతగా తమ వాదనను సమర్థించుకున్నా... ఈ పరిమితి అనేది మాత్రం చట్టబద్ధంగా కాకపోయినా వాస్తవ ప్రపంచంలో పాటించక తప్పనిసరి. ఆవిధమైన పాటింపు కొనసాగుతున్నది కూడా! నల్లజాతి అమెరికన్లను వివరించేందుకు వీలుగా ఏ అమెరికన్ ఎడిటర్ కూడా 'ఎన్' అనే పదాన్ని ఉపయోగించరు. ఆ విధంగా ప్రయోగించడం చట్టవిరుద్ధమని కాదు, అది చాలా అతిపెద్ద నేరానికి కారణమవుతుందని! ట్రొపెజ్, కొపకబన లేదా బొన్‌డి బీచ్‌ల్లో బికిని పై భాగాలను తొలగించి మహిళలు స్వేచ్ఛగా సంచరించగలుగుతారు. మరి అచ్చం అదేమాదిరిగా మహిళలు గోవా లేదా కరాచీ, దుబాయ్ బీచ్‌ల్లో తిరగడం సాధ్యమా? ఒకవేళ ధైర్యం చేసి తిరిగినా దాడులు, అరెస్ట్‌లు నిరోధించడం దుస్సా ధ్యం. ఎందుకంటే అక్కడ ఆ విధంగా తిరగడం నేరం మరి! వేర్వేరు దేశాల్లో వైవిధ్యభరిత పరిస్థితులు నెలకొనివున్నప్పుడు, అటువంటి తేడాలు ఉండటం జరగదని వాదించడం తప్పు. అందువల్ల వాక్ స్వాతంత్య్రాలు కొనసాగుతాయి. కాకపోతే దేశకాలమాన పరిస్థితులను బట్టి అవి ఉంటాయి. ఉదాహరణకు సింగపూర్ మాదిరిగా స్విడన్‌లో వాక్‌స్వాతంత్య్రం అమల్లో ఉండదు మరి.
సోషల్ నెట్‌వర్క్ సైట్లలో వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే, అవి ప్రజా వేదికలుగా పనిచేస్తున్నాయి. అవి ఎంతటి ప్రయోజనకారులుగా ఉన్నాయో, అంతటి సమస్యలకు కూడా కారణమవుతున్నాయి. సామాన్యులు కూడా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఈ సోషల్ మీడియా అవకాశం కల్పిస్తుంది. వీటిపై ఎటువంటి సెన్సార్‌షిప్ అమలు చేయరు. కీబోర్డును అప్‌డేట్ చేసే కనీస పరిజ్ఞానం కలిగిన ఏ వ్యక్తి అయినా చక్కగా తన అభిప్రాయాలను సమాచారం ద్వారా అప్పటికప్పుడు వెల్లడించవచ్చు. ఆ సమాచారం వీడియో లేదా టెక్స్ట్ రూపంలోఉన్నా పరవాలేదు. ఆవిధంగా సమాచారాన్ని వెల్లడి చేయడంలో ఎడిటోరియల్ నియంత్రణల వంటి అడ్డంకులు ఏమాత్రం ఉండవు, ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే సమాచారం ప్రపంచానికి తెలిసిపోతుంది. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి వెల్లడి చేయడంలో..సంప్రదాయ మీడియాపై, సోషల్ మీడియా పైచేయి సాధించింది సరీగ్గా ఇక్కడే! ఒక దినపత్రికలో మీ అభిప్రాయాలు ప్రచురితం కావాలంటే, మీరు ముందుగా వాటిని ఎడిటోరియల్ మస్టర్‌కు పంపాలి. మీరు రాసిన నిజాలు, అభిప్రాయాలను అక్కడ పూర్తిగా తనిఖీ చేస్తారు, మీరు రాసిన వ్యాసంలో కొంతభాగం కోతకు గురికావచ్చు. వీటికి తోడు అది ప్రచురితం కావడానికి వారాలు, నెలల తరబడి మీరు వేచివుండాల్సి వుంటుంది. మరి ఇదే సోషల్ మీడియాలో ఈ బాధలేమీ ఉండవు. మీరు కోరుకున్నది అందులో రాయవచ్చు. మీరు అనుకున్న విధంగా పదజాలాన్ని ప్రయోగించవచ్చు. అది మీ బ్లాగ్ లేదా ఫేస్‌బుక్ పేజీ ఏదైనా కావచ్చు. మీరు దాన్ని ట్విట్టర్ లింక్‌తో జతపరచండి. వౌజ్‌ను క్లిక్ చేసి అది ఒక వైరస్‌మాదిరిగా శరవేగంగా ఏవిధంగా ప్రపంచానికి తెలిసిపోతున్నదీ గమనించండి. నిజంగా ఇది 21వ శతాబ్దం మనకు ప్రసాదించిన స్వేచ్ఛ! దీన్ని ఏ రాజకీయ నాయకుడు అడ్డుకోలేడు.
కానీ మనం అనుభవించే ఈ స్వేచ్ఛలోనే, గొప్ప ప్రమాదం కూడా పొంచివుంది. ఎవరైనా, ఏదైనా చెప్పవచ్చు..చాలామంది చేసే పని కూడా అదే. అబద్ధాలు, వక్రీకరణలకు సంబంధించిన కాలంలు సైబర్ స్పేస్‌ను నిర్నిరోధంగా ఆక్రమించేస్తున్నాయి. ఇందులో నిజాలేవో, అబద్ధాలేవో తెలుసుకోవడం కష్టం. పోనీ రాసిన అంశాల్లోని వాస్తవాలను నిర్థారించే సంస్థాగతమైన ఏర్పాటు ఏమైనా ఉన్నదా అంటే అదీ లేదు. ఆవిధంగా సోషల్ మీడియా ఇస్తున్న అనుమతి ప్రజల్లో బాధ్యతారాహిత్యాన్ని మరింతగా పెంచేదిగావుంది. ఎవరైనా వ్యక్తి ఎదుట తాము వాడటానికి సాహసించని పదజాలాన్ని కూడా యదేచ్ఛగా అందులో ప్రయోగిస్తున్నారు. చట్టబద్ధమైన సృజనాత్మకతకు, రెచ్చగొట్టే లేదా ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా రాసే రాతలకు మధ్య వున్న అడ్డుగోడ క్రమంగా కనుమరుగవుతూ, ప్రస్తుతం అస్పష్ట స్థితికి చేరుకుంది.
రాజకీయాల గురించి కపిల్ సిబల్ అసలు బాధపడటం లేదు. కానీ కొందరు మతం ముసుగులో రెచ్చగొట్టే ధోరణులను ప్రోత్సహిస్తుండటం పట్ల మాత్రమే ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలోకి ప్రవేశపెట్టే చెడు విషయాలను వ్యక్తులు, తమ ఇళ్లలో కూర్చుని రాయవచ్చు. కానీ వారు వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలోకి విస్తరింప జేస్తున్నారు కదా!మరి అటువంటప్పుడు తప్పనిసరిగా అవి దుష్పరిణామాలనే కలిగిస్తాయి. ఇక్కడ ఒక్క అంశం మాత్రం సుస్పష్టం. సెన్సార్‌షిప్ విధించడం అమోదయోగ్యం కాదు. కాని ఇదే సమయంలో హింసాత్మక, మత సంఘర్షణలను ప్రేరేపించే అంశాలను ప్రచురించడమంటే..పెట్రోల్ బంకులో అగ్గిపుల్ల గీసి వేసినట్టే! ఏ సభ్య సమాజం కూడా వీటిని సహించలేదు. అటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ బంక్‌ను మూసేదానికంటే, మండుతున్న అగ్గిపుల్లను ఆర్పివేయడానికే మనం యత్నించడం విజ్ఞత అవుతుంది! ప్రస్తుతం సిబల్ చేసిన పని అదే!
13, డిసెంబర్ 2011, మంగళవారం
స్వేచ్ఛ దుర్వినియోగం కారాదు- శశిథరూర్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి