6, డిసెంబర్ 2011, మంగళవారం

అసలు కథ ముందుంది

కేసు ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినవాడు ఇంటికెళ్లి ఏడిచాడని సామెత. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాసం వీగిపోయిన వ్యవహారమూ ఇంచుమించు ఈ బాపతే. పైపైన చూస్తే ‘అవిశ్వాస’ ఫలితానికి బాధపడవలసిన అవసరం ఏ పక్షానికీ ఎంతమాత్రమూ ఉండనక్కరలేదు. విశ్వాసరాహిత్య తీర్మానాన్ని ప్రతిపాదించిన విపక్ష నేత చంద్రబాబునాయుడుకే అది నెగ్గుతుందేమోనన్న అనుమానం ఏ కోశానా లేదు. ఇదే తీర్మానాన్ని ఎనిమిది నెలల కిందో ఏణ్నర్ధం కిందో తెచ్చి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం బహుశా కుప్పకూలేదేమో. రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక నిష్క్రమణానంతరం కాంగ్రెస్ నాయకత్వానికి కంటికి కునుకు లేకుండా చేసి, 50 మంది దాకా ఎమ్మెల్యేలను బాహాటంగా సమీకరించి తాను తలచుకుంటే ఏనాడైనా ప్రభుత్వాన్ని కూల్చగలనని తొడకొట్టి సవాలు చేసిన వై.ఎస్. జగన్‌ను రకరకాల కేసుల చక్రబంధంలో ఇరికించి, అతడి వైపు నుంచి చాలామంది ఎమ్మెల్యేలను నయానా భయానా కాంగ్రెస్‌లోకి తిరిగి ఆకర్షించే కార్యక్రమం ముమ్మరమయ్యాక బలాబలాలు గుణాత్మకంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెసు పాలనను భూస్థాపితం చేస్తానని బయలుదేరి, ఎన్నికల్లో శృంగభంగమైన చిరంజీవి కిరణ్ సర్కారుకు ఆపద్బాంధవుడయ్యాడు. 17 మంది ఎమ్మెల్యేల ‘చిరు’బలం ఊపిరాడని కాంగ్రెసుకు ప్రాణవాయువునందించింది. మారిన రాజకీయ స్థితిగతుల్లో నిశ్శబ్ద విప్లవమేదో ముంచుకొస్తే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు లేదని లెక్కల్లో కొద్దిపాటి ప్రవేశం ఉన్న సామాన్యుడికి కూడా తెలుసు. కాబట్టి 38 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోవటం దాన్ని తెచ్చినవారికి పరాభవమూ కాదు, నెగ్గినవారికి దిగ్విజయమూ కాదు.
చూసే వారి ఓరిమిని పరీక్షించేలా రొడ్డకొట్టుడు ఉపన్యాసాలతో ఏకబిగిన 16 గంటలపాటు సాగిన ‘అవిశ్వాస’ క్రమంలో అందరికీ ఉత్కంఠను రేకెత్తించింది సర్కారు ఉంటుందా, ఊడుతుందా అన్నది కాదు. అటు పాలకపక్షానికీ, ఇటు ప్రతిపక్షానికీ సింహస్వప్నమై, వాటిమధ్య అడపాదడపా ఆపద్ధర్మపు మాచ్ ఫిక్సింగులకూ కారణభూతుడైన ‘ఓదార్పు’రాయుడి నికరబలం ఎంతన్నదే ప్రతిఒక్కరూ అత్యాసక్తితో తెలుసుకోగోరిందల్లా. తిరుగుబాటుదారుడి పక్షాన చివరికి లెక్కతేలింది 18 మంది ఎమ్మెల్యేలు. ఒకప్పుడు అతడి వైపు కనిపించిన వాపుతో పోలిస్తే ఈ బలుపు చాలా తక్కువే. కంటిచూపుతో సర్కారును పడగొట్టగలనని, తన దయాధర్మం మీదే ప్రభుత్వ మనుగడ ఆధారపడ్డదని బీరాలు పలికినవాడు తీరా అవిశ్వాస బరిలో బొక్క బోర్లాపడ్డాడని జగన్‌పై పగబట్టిన విరోధి మీడియా పరవశించి పగలబడటం సహజమే. కాని.. కరకు కేసులతో వెంటాడి, జగన్ అనుయాయులను వీలైన మేరకు వేధిస్తూ.. అతడి శిబిరంలోని వారిని బయటికి లాగేందుకు సర్కారు వారు రకరకాల ప్రలోభాలు ఎరచూపుతూ ఎన్ని తంటాలు పడ్డా... కామధేనువులాంటి ఎమ్మెల్యేగిరీని వదులుకునేందుకు కూడా సిద్ధపడి 17 మంది ఎమ్మెల్యేలు ఏ అధికారం లేని ఒంటరి యోధుడి వెంట నిలబడటం సామాన్య విశేషం కాదు. అధికార దర్పాన్ని ఎంతగా ఝుళిపించినా పెద్ద కుర్చీల్లోని మహామహావాళ్లకే పవరు పోతే ఒక్క ఎమ్మెల్యే అయినా వెంట ఉంటాడని ఖాయంగా చెప్పలేని ఈ రోజుల్లో ఇప్పట్లో గెలిచే ఆశలేని ఒక్కడికి ఇంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వటం అబ్బురమే.
అవిశ్వాస తీర్మానాన్ని తెచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టగలగడం అరుదైన కొన్ని సందర్భాల్లో మాత్రమే సాధ్యం. తీర్మానం నెగ్గే ఆశ ఉన్నా లేకున్నా, ప్రభుత్వాన్ని నిలదీసి, పాలకవర్గ వైఫల్యాలను, తద్వారా ప్రజాహితానికి వాటిల్లుతున్న అనర్థాలను ఎండగట్టటానికి అవిశ్వాసం చక్కని మిష. కాని అందివచ్చిన అవకాశాన్ని విపక్షం ఆ రకంగా కూడా సరిగా వినియోగించుకోలేక పోయింది. మూడు గంటలకు పైగా సాగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ప్రసంగంలో ఉరుములే తప్ప మెరుపులు తక్కువ. గతంలో లెక్కలేనన్ని సందర్భాల్లో శాసనసభా వేదిక లోపలా, వెలుపలా పదేపదే సంధించుకున్న పరస్పరారోపణస్త్రాలను, దుర్భాషలను చర్వితచర్వణం చేయడానికి మించి ఎవరు కొత్తగా చెప్పిందీ ఏమీలేదు. ఒకప్పుడు ఒకరి పొడను ఒకరు సహించలేనంతగా వైమనస్యం పెంచుకుని, ఇటీవలి కాలంలో అవసరార్ధం లోపాయికారీ లాలూచీలకు పాల్పడ్డారని నిందపడ్డ కిరణ్‌రెడ్డి, చంద్రబాబు మళ్లీ పాత రోజులను గుర్తుకుతెచ్చే రీతిలో చెలరేగి చడామడా వాదులాడటం చూడముచ్చట. వై.ఎస్ బొమ్మ పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెసు వారు అదే నాయకుడిపై ఎవరెన్ని అభాండాలు వేసినా పట్టనట్టు మిన్నకుండటంలోని ఔచిత్యాన్ని అసెంబ్లీలో తొట్టతొలి ప్రసంగంలో వై.ఎస్ సతి ఉద్వేగభరితంగా ఎత్తిచూపటం చెప్పుకోదగ్గ ఇంకో విశేషం.
అధిష్ఠానం రంగంలోకి దిగి, రాజకీయ దురంధరులను సమీకరించి, సర్వశక్తులూ ఒడ్డి అవిశ్వాస తీర్మానాన్ని తట్టుకోగలగటం వల్ల పాలకపక్షానికి కలిగే ఆనందం కంటే రాగల రోజులను తలచుకుంటే కలిగే ఆందోళనే ఎక్కువ. అష్టకష్టాలు పడి అవిశ్వాస గండాన్ని గట్టెక్కినా, కిరణ్‌కుమార్ ప్రభుత్వం స్థిరత్వాన్ని కోల్పోయింది. జగన్ వర్గానికి చెందిన 18 మంది ఎదురుతిరిగిన దరిమిలా సర్కారు బలం 153 నుంచి 136కు తగ్గి మైనారిటీలో పడిపోయింది. ఇన్నాళ్ల కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం పోయి రాష్ట్రంలో ఇకపై ఒక విధంగా మిశ్రమ ప్రభుత్వం రాజ్యమేలుతుంది. చిరంజీవి, ఎం.ఐ.ఎం, కొందరు ఇండిపెండెంట్ల దయాధర్మం మీద ప్రభుత్వం మనుగడ ఆధారపడినప్పుడు అడుగడుగునా ఒత్తిళ్లకు, రకరకాల బ్లాక్‌మెయిలింగులకు తల ఒగ్గక తప్పదు. అసలే దినదినగండం కానున్న సమయంలో విప్‌ను ధిక్కరించిన 17 మంది తిరుగుబాటుదారులను ఏమి చేయాలన్నది పెద్ద సమస్య. వేటు వేయకుంటే నాయకత్వం ఇంకా అలుసవుతుంది. తిరుగుబాటుదారులు ఇంకా పెచ్చరిల్లి, పార్టీ నాయకుల బతుకులను దుర్భరం చేస్తారు. అలాగని పంతానికి పోయి నిబంధనల ప్రకారం వేటు వేస్తే ఉప ఎన్నికలు తప్పవు. ఇప్పటికే ఖాళీపడిన ఏడింటికి ఇవి కూడా తోడై ఏకంగా 24 చోట్ల ఎన్నికల అగ్నిపరీక్షకు నిలబడవలసి వస్తుంది. వాటిలోనూ ఏడు ప్రస్తుతం కాంగ్రెసు పేరు చెబితే కుతకుతలాడుతున్న తెలంగాణలో ఉన్నాయి. అటుచూస్తే సీమాంధ్రలోనూ జగన్ ధాటికి కాంగ్రెస్, దేశాలకు చెమటలు పడుతున్నాయి. కడప, బళ్లారి ఉప ఎన్నికల అనుభవం కర్మంచాలక మునుముందూ దాపురిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో? అగత్యాన్ని నివారించాలంటే... అనర్హత వేటు కోరుతూ స్పీకరుకు అర్జీ పెట్టినట్టే పెట్టి ఎటూ తేల్చకుండా దానిని మాగవేయించడమే తరణోపాయమా?
source:andhrabhoomi

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి