10, డిసెంబర్ 2011, శనివారం

నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం ‘రాజన్న’ :నాగార్జున


 వైవిధ్యభరితమైన చిత్రాలను చేయడానికి ఎప్పుడూ ముందుండే నాగార్జున తాజాగా నటించిన చిత్రం 'రాజన్న'. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కూడా కావడం విశేషం. పలు హిట్ చిత్రాలకు కథలు అందించిన విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో ఇది రూపొందింది. ఈ చిత్రంలోని పోరాట దృశ్యాలను విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి చిత్రీకరించారు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నాగార్జున తన మనోభావాలను ఈ విధంగా వెల్లడించారు.


ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన యధార్ధ గాథ ఆధారంగా తీసిన సినిమా 'రాజన్న'. నేనెంతో ఇష్టపడి చేసిన సినిమా. ఇది ఒక్క రాజన్న కథ మాత్రమే కాదు. రాజన్నకు మల్లమ్మ అనే కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి తన స్వేచ్ఛ కోసం పాటుపడే కథ కూడా. ఈ సినిమాలో రాజన్న కథ ఎంత ముఖ్యమో ఈ మల్లమ్మ కథ కూడా అంతే ముఖ్యం. మల్లమ్మగా 'అని' అనే పాప యాక్ట్ చేసింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆ పాప కనబర్చిన నటన ప్రేక్షకుల కంట తడిపెట్టిస్తుంది.

విజయేంద్రప్రసాద్ ఈ కథ చెప్పగానే ఇన్‌స్పయిర్ అయ్యి ఒప్పుకున్నాను. ఆయన ఎంతో ఇష్టపడిన కథ ఇది. ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారాయన. రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే కథ ఇది. బడుగు, బలహీన వర్గాల ప్రజలపై రజాకారులు సాగించిన అన్యాయాలు, దౌర్జన్యాలపై తిరుగుబాటు చేసి, ప్రజల్లో చైతన్యాన్ని నింపుతాడు రాజన్న. తను ఒక విప్లవకారుడు. రాజన్న పోరాటం రజాకార్లు, దొరలపైన మాత్రమే కాదు.. ప్రతి అన్యాయంపైన. ఎక్కడ అన్యాయం కనిపిస్తే... అక్కడ రాజన్న ఉద్భవిస్తాడు. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పోరాటం చేస్తాడు.

పాటతోనూ పోరాటం
రాజన్న పోరాటం కత్తితో మాత్రమే కాదు... తన పాటతో కూడా చేశాడు. అందుకే 'రాజన్న' సినిమాకి పాట అనేది చాలా ఇంపార్టెంట్. నేలకొండపల్లెలోని గ్రామస్తులకు తన పాట ద్వారా ధైర్యం నూరిపోస్తాడు రాజన్న. పాట ప్రధానంగా సాగే సినిమా కాబట్టి... కీరవాణిగారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రంలో దాదాపు 13 పాటలుంటాయి. పాటలన్నీ కూడా కథానుసారం సాగుతాయి కాబట్టి.. ప్రేక్షకులు అసహనానికి గురవ్వరు. కొన్ని రియల్ సాంగ్స్‌ని వాడాం. 

ఈ పాటల్లో నాకు 'గిజిగాడు..' పాట బాగా నచ్చింది. అలాగే 'వెయ్... వెయ్..' అనే పాటను రాజమౌళి అద్భుతంగా తీశాడు. మనిషిలోని పిరికితనం పోగొట్టే పాట ఇది. ఈ పాట ప్రధానంగా యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. పాటలో డైలాగ్స్ కూడా ఉంటాయి. శబ్దహోరు లేకుండా పాటల్లో సాహిత్యం చక్కగా వినపడుతుంది. పాటలు మాత్రమే కాదు.. కీరవాణిగారు చేసిన రీ-రికార్డింగ్ ఈ కథను బాగా ఎలివేట్ చేసే విధంగా ఉంది.

ఈ సినిమాలో పొడవాటి జుత్తుతో, పంచె, లాల్చీతో శాలువా కప్పుకుని కనిపిస్తాను. ఈ గెటప్ కోసం నాలుగైదు విగ్గులు తయారు చేయించడం జరిగింది. చివరికి ఒకటి సెట్ అయ్యింది. ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలు, గెటప్స్ చేసే అవకాశం ఏ ఆర్టిస్టుకైనా అరుదుగా వస్తాయి. ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత అప్పట్లో అమాయక ప్రజలపై రజాకార్లు చేసిన అన్యాయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఇంత పాశవికంగా కూడా ఉంటారా? అనిపించింది. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది.
30
నిమిషాలు మినహా సినిమా అంతా ఉంటాను

ఈ చిత్రంలో నేను అతిథి పాత్ర చేశాననే వార్త ప్రచారంలో ఉంది. సినిమా మొత్తం మీద నేను కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమే అని కూడా అనుకుంటున్నారు. కానీ నేను కనిపించనిది 30 నిమిషాలు మాత్రమే. మిగతా సినిమా మొత్తం ఉంటాను. ఇంటర్వెల్‌కి 30, 40 నిమిషాల ముందు నా పాత్ర ఎంటర్ అవుతుంది. అయితే అప్పటివరకు గ్రామ ప్రజలు.. తమకోసం రాజన్న వస్తాడు.. తమ జీవితాలకు మంచి చేస్తాడు అంటూ రాజన్న గురించే మాట్లాడతారు. ఆ రకంగా నా పాత్రకు సంబంధించిన డిస్క్రిన్షన్ ఉంటుంది. వాస్తవానికి రాజన్న పాత్రలో నన్ను నేను తెర మీద ఎప్పుడెప్పుడు చూసుకుందామా? అన్నంత ఎక్సయిటింగ్‌గా ఈ సినిమా చేశాను.

ఈ చిత్రంలోని ఫైట్స్‌ని రాజమౌళి కంపోజ్ చేశాడు. ఆయన టేకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. 1940, 50 ప్రాంతంలో జరిగిన కథ ఇది. దొరలపై తిరుగుబాటు చేయడానికి అప్పట్లో ప్రజలకు ఆయుధాలు ఉండేవి కావు. కర్రలు వాడేవారు. అందుకని ప్రత్యేకంగా అవి తయారు చేయించాం. ఫైట్స్ అన్నింటినీ రాజమౌళి బ్రహ్మాండంగా తీశాడు. అప్పటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబించే విధంగా సెట్స్ తయారు చేయించాం. భాష కూడా ఆ కాలానికి తగ్గట్టుగానే ఉంటుంది. కళ్ల ముందు జరుగుతున్న యధార్ధ సంఘటనలు చూస్తున్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ సినిమా విజయానికి అదొక కారణం అవుతుంది. ఈ సినిమా నా అభిమానులకు, ఇతర ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

మ్యూజికల్ ఫీస్ట్
'
రాజన్న' సినిమాని అందరం ఎంతో ఎక్సయిట్‌మెంట్‌తో చేశాం. ఈ సినిమా చేయడానికి చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నాటి తరం కథ అయినా నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఇదొక మ్యూజికల్ ఫీస్ట్. కీరవాణిగారు చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతం. అందుకే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ప్రత్యేకంగా సీడీ రూపంలో విడుదల చేయాలనుకుంటున్నాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి