13, డిసెంబర్ 2011, మంగళవారం

వెంకటేష్ బర్త్‌డే రోజు ‘బాడీగార్డ్’ పాటల జోరు

 ''అభిమానుల మధ్య నా పుట్టిన రోజున 'బాడీగార్డ్' పాటలు విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. 25 ఏళ్ల నా కెరియర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేశాను. దానికి కారణం అభిమానుల ప్రోత్సాహమే. 'బాడీగార్డ్' ఈ సంక్రాంతికి ఓ మంచి సినిమాలా నిలుస్తుంది. అభిమానుల అంచనాలను అందుకుంటుంది'' అని వెంకటేష్ అన్నారు.

 

 ఆయన కథానాయకుడిగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం 'బాడీగార్డ్'. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ పైవిధంగా స్పందించారు. ఆడియో సీడీని వివి వినాయక్ ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రభాస్‌కు అందించారు.

 

 'బాడీగార్డ్' సినిమా వెబ్‌సైట్‌ను తమిళ హీరో కార్తీ ఆవిష్కరించారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''మలయాళం, హిందీ వెర్షన్‌లకంటే తెలుగు 'బాడీగార్డ్' పెద్ద హిట్ అవుతుంది. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. జనవరి 9న అంటే రెండు రోజుల ముందుగానే ఓవర్‌సీస్‌లో రిలీజ్ చేస్తున్నాం. వెంకటేష్ కెరియర్‌లో ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుంది అని నమ్మకంతో చెప్పగలను'' అన్నారు.

 

 కథానాయిక త్రిషతోపాటు డి.రామానాయుడు, రానా, కె.ఎస్.రామారావు, కె.ఎల్. నారాయణ, సంతోష్ శ్రీనివాస్, వేణుమాధవ్, ఎంఎల్ కుమార్ చౌదరి, భీమినేని శ్రీనివాస్, మెహర్ రమేష్, పైడిపల్లి వంశీ, పరుచూరి శివరాంప్రసాద్, రమేష్ పుప్పాల, రజత్ పార్థసారధి, రామ్‌లక్ష్మణ్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి