55 కు దిగజారొచ్చని మార్కెట్ వర్గాల అంచనా
మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయం
వేగంగా పడిపోతున్న మన రూపాయి విలువ మరింత దిగజారి...దిగజారి పాతాళానికి పడిపోతుందనే ఊహాగానాలు మార్కెటు వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. రెండో రోజు కూడా డాలరుకు రూపాయి విలువ మరింత పతనమయింది. మంగళవారం రూపాయి పాక్షిక మారక విలువ డాలరుకు రికార్డు స్థాయిలో 53.52కు తగ్గిపోయిన తరువాత 53.22/23 దగ్గర ముగిసింది. సోమవారం డాలరుకు 52.84/85 వద్ద ముగిసింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజుకు 0.7 శాతం పడిపోయింది. ఈ పతనం ఇంతటితో ఆగదని, రాబోయే రోజుల్లో ఇంకా కొనసాగవచ్చని మార్కెటు విశ్లేషకులు, వ్యాపార వేత్తలు అంచనా వేస్తున్నారు. రూపాయి విలువ డాలరుకు 55కు తగ్గిపోతుందని కొందరు అంచనా వేస్తున్నారు. రోజురోజుకూ విలువ పెంచుకుంటున్న అమెరికన్ కరెన్సీ కోసం బ్యాంకులు, దిగుమతి దారులు, విదేశీ, స్వదేశీ పారిశ్రామికవేత్తల
నుండి డిమాండ్ పెరగటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కాగా మంగళవారం రూపాయి విలువ పతనం తరువాత కూడా స్టాక్ మార్కెటు నిలకడగానే ఉంది. రూపాయి విలువ పడిపోవడానికి యూరో సంక్షోభం కారణమని, దీనివల్ల భారత్‌వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం మందగిస్తుందని మార్కెటు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పెరుగుతున్న వర్తక లోటు, రిజర్వు బ్యాంకు బలంగా జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉండటం, కరెన్సీ నిల్వలు శక్తి పరిమితం కావడం మొదలైన కారణాల వల్ల రూపాయిపై ఒత్తిడి పెరగవచ్చని మార్కెటు వర్గాలు తెలిపాయి.
గత నాలుగు వారాల్లో డాలరుకు వ్యతిరేకంగా రూపాయి విలువ 4.8 శాతం పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 16 శాతం తగ్గింది. అక్టోబరులో పారిశ్రామికోత్పత్తి 5.1 శాతం మేరకు పడిపోయిన సంగతి తెలిసిందే. పారిశ్రామికోత్పత్తికి సంబంధించిన గణాంకాలు భారత వృద్ధి విషయంలో చెడు అభిప్రాయం కలిగించాయని యూకో బ్యాంకు సీనియర్ మేనేజర్ ఉదరు భట్ అన్నారు. రూపాయి విలువ దారుణంగా పతనమవుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు తన పరపతి విధానాన్ని ఈ నెల 16న ప్రకటించనుంది. అయితే ఆర్‌బిఐ సానుకూలంగా వ్యవహరిస్తుందన్న సంకేతాలు లేవు. మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయం వెంటాడుతోంది. మళ్లీ సామాన్యులపై భారాలు పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది కాలంలో ఆర్‌బీఐ పదమూడుసార్లు కీలక రేట్లు పెంచిన సంగతి తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి