7, డిసెంబర్ 2011, బుధవారం

బొత్స, బాబు కూడబలుక్కుని జగన్‌పై వ్యాఖ్యలు: అంబటి

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడబలుక్కుని తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర రాజకీయమని ఆ ఇద్దరు నాయకులు అనడాన్ని బట్టే వారిద్దరు కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని దించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి బొత్స సత్యనారాయణ రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన 18 శానససభ్యులపై అనర్హత వేటు వేయడానికి కాంగ్రెసు పార్టీ భయపడుతోందని ఆయన అన్నారు వారిపై అనర్హత వేటు వేస్తే రాష్ట్రంలో 24 స్థానాల్లో వచ్చే ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే తమ శాసనసభ్యులపై అనర్హత వేటుపై నిర్ణయంలో జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు.

 

చర్యలు తీసుకునే స్పీకర్ సమక్షంలోనే శానససభ్యులు విప్‌ను ధిక్కరిచారని, కాంగ్రెసు అదే రోజు ఓ లేఖ ఇస్తే తెల్లారి ఆ శాసనసభ్యులపై అనర్హహత వేటు పడేదని ఆయన అన్నారు. జగన్ వర్గం శానససభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించడం, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్పడం ద్వారా నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. పెళ్లి ఒక్కరితో సంసారం మరొకరితోనా అంటూ జగన్ వర్గం శానససభ్యులపై వ్యాఖ్యానించిన కాంగ్రెసు నాయకులు చర్యలకు ఎందుకు వెనకాడుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు నాయకులు అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభపెట్టారని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి