నేడు విండీస్‌తో నాలుగో వన్డే
మ.2.30 గం||లకు డిడి, నియో క్రికెట్‌లో
ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద సమస్యగా మారింది. స్వదేశంలో ఇంగ్లండ్‌ను 5-0తో వైట్‌వాష్ చేసిన టీమిండియాకు విండీస్ బౌలర్లు దడపుట్టిస్తున్నారు. ఆరంభంలో విండీస్ పేసర్ల ఎదురుదాడిని ఎదుర్కోవడంలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వరుసగా విఫలమవుతున్నారు. సెహ్వాగ్, గంభీర్ సులువుగా వారి వలలో పడుతున్నారు. మొతేరాలో రాంపాల్ దెబ్బకు ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ డకౌటైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భారత ఓపెనర్లు జట్టుకు శు భారంభం ఇవ్వలేక పోయారు. మూడు వన్డేల్లో సెహ్వాగ్ 46 (20, 26, 0), గంభీర్ 16 (4, 12 , 0) పరుగులు మాత్రమే చేశారు. ధోనీ గైర్హజరీతో కీపింగ్ కమ్ ఓపెనర్‌గా దిగుతున్న పార్థివ్ ఆకట్టుకోలేకపోతున్నాడు. మొతేరాలో 39 పరుగులు చేసినా దాన్ని భారీ స్కోరుగా మాలచడంలో విఫలమయ్యాడు. మిడిలార్డర్‌లో యువ బ్యాట్స్‌మన్ సురేష్ రైనాది ఘోర వైఫల్యం. రైనా మూడు వన్డేల్లో కేవలం 7 (5, 0, 2) పరుగులే చేశాడు. ఒక వైపు కోహ్లీ, రోహిత్ చెలరేగుతుంటే రైనా ప్లాప్ షో చేస్తున్నాడు. బ్యాటింగ్ భారాన్ని కోహ్లీ, రోహీత్ మోస్తున్నారు. ఇండోర్‌లో కూడా వారిపైనే బాధ్యత ఎక్కువగా ఉంది.
పేస్‌కు కొత్తరూపు : ఇర్ఫాన్ పఠాన్ చేరికతో పేస్ బౌలింగ్ విభాగం కొత్త రూపు దిద్దుకో నుంది. అతడు చివరి రెండు వన్డేలకు అందు బాటులో ఉండనున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వినరు, మిథున్, ఇర్ఫాన్, అరోన్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది.
తొలి రెండు వన్డేల్లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన విండీస్ మూడో వన్డేలో చివరి వరకూ పట్టు సడలనివ్వలేదు. విండీస్ బ్యాటింగ్ విభాగం పదునెక్కింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమైనా టెయిలెండర్లు జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నారు. మొతేరాలో చివరి రెండు ఓవర్లలో సామి, రస్సెల్ ఇన్నింగ్స్ విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో శ్యాముల్స్, బ్రావో, సిమన్స్ రాణిస్తున్నారు. నాలుగో వన్డే నుంచి బ్రావో వైదొలగడం విండీస్‌కు దెబ్బే. చివర్లో రస్సెల్, రాంపాల్‌లు ఒక చేయి వేస్తున్నారు. విశాఖలో పదో వికెట్‌కు రాంపాల్ ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కరేబియన్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్లకు సమస్యలు సృష్టించడంలో సఫలమవుతున్నారు. ఇండోర్‌లో కూడా హోరా హోరీ తప్పెట్టు లేదు. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకున్న విండీన్‌ను వీరూ సేన తక్కువగా అంచనా వేస్తే అసలుకే మోసం రావచ్చు.
బ్రావో ఔట్ : వెస్టిండీస్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కీలక బ్యాట్స్‌మన్ డారెన్ బ్రావో గాయం కారణంగా ఇండోర్‌లో నాలుగో వన్డేకు దూరమయ్యాడు. మొతేరాలో మ్యాచ్‌లో బ్రావో 26 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్‌గా వెనుతిరిగిన సంగతి తెలిసిందే. బ్రావో హ్యామ్‌స్టరింగ్ ఇంజురీతో బాధపడుతున్నాడు. బ్రావో స్థానంలో తుది జట్టులోకి పావెల్ రానున్నాడు.
బ్యాటింగ్ పిచ్ : ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో పరుగుల వరద ఖాయ అంటున్నాడు క్యూరేటర్. పిచ్‌ను బ్యాటింగ్ పిచ్‌గా తయారు చేసినట్టు పిచ్ క్యూరేటర్ సముందర్ సింగ్ చౌహాన్ తెలిపాడు. అతడు బ్యాటింగ్ పిచ్‌లు రూపొందించడంలో సిద్ధహస్తుడు. ఇక్కడ 300 పరుగుల స్కోరు నమోదయ్యే అవకాశం ఉందన్నాడు. ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌నే విజయం వరించింది. సెహ్వాగ్ బ్యాట్‌తో రెచ్చిపోతే టీమిండియాకు ఇక్కడ హ్యాట్రిక్ విజయం లాంఛనమే.
జట్లు :
భారత్ : వీరేంద్ర సెహ్వాగ్ (కెప్టెన్), గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేష్ రైనా, జడేజా, పార్థివ్ పటేల్, అశ్విన్, అభిమన్యు మిథున్, వినరు కుమార్, ఇర్ఫాన్ పఠాన్, వరుణ్ అరోన్, రాహుల్ శర్మ, మనోజ్ తివారి.
వెస్టిండీస్ : డారెన్ సామి (కెప్టెన్), సిమన్స్, భరత్, శ్యాముల్స్, డారెన్ బ్రావో, హ్యాత్, పోలార్డ్, రాందిన్, రస్సెల్, రవి రాంపాల్, రోచ్, మార్టిన్, నరైనె, పావెల్, మహ్మద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి