8, డిసెంబర్ 2011, గురువారం

చిక్కుల్లో చిదంబరం

కేంద్ర హోం మంత్రి చిదంబరం చిక్కుల్లో చిక్కుకున్నారు. యూపీఏ సర్కారుకు ఇప్పటికే ఉన్న తలనొప్పులను మరింతగా పెంచారు.

2జీ కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశాలతో హోంమంత్రికి ఇరకాటం

కేంద్ర హోం మంత్రి చిదంబరం చిక్కుల్లో చిక్కుకున్నారు. యూపీఏ సర్కారుకు ఇప్పటికే ఉన్న తలనొప్పులను మరింతగా పెంచారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో సాక్షిగా మారేందుకు, చిదంబరం పాత్రపై ఆధారాలు సమర్పించేందుకు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామికి ఢిల్లీ కోర్టు అనుమతివ్వడం ఎన్డీఏ సహా విపక్షాలకు పెద్ద అస్త్రంగా మారింది.

 ఇంతకాలం చిదంబరాన్ని మొండిగా సమర్థిస్తూ వస్తున్న యూపీఏ ప్రభుత్వానికి కోర్టు నిర్ణయంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఈ విషయమై గురువారం పార్లమెంటు అట్టుడకడం, మంత్రి రాజీనామా డిమాండ్‌తో ఉభయ సభలనూ ఎన్డీఏ స్తంభింపజేయడంతో పాలకపక్షం పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది. తప్పుకోకుంటే కేంద్రమే ఆయన్ను తప్పించాలంటూ విపక్షాలన్నీ ఒకవైపు మూకుమ్మడిగా డిమాండ్ చేస్తుండగానే.. విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణపై ఎఫ్‌ఐఆర్ ఉదంతం పులిమీద పుట్రలా వచ్చి పడటంతో యూపీఏ పెద్దలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

 ఏం చేయాలో ఎటూ పాలుపోక తలపట్టుకున్నారు. కర్ణాటకలో అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త న్యాయమూర్తి ఆదేశానుసారం కృష్ణపై పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో యూపీఏ సారథి కాంగ్రెస్ పరిస్థితి ఒక్కసారిగా పెనం నుంచి పొయ్యిలోకి దిగజారింది. ఇప్పటికే 2జీ కేసులో టెలికం మంత్రి ఎ.రాజా పదవి పోగొట్టుకుని జైలు పాలవడం తెలిసిందే. పటిష్ట లోక్‌పాల్ కోసం అన్నాహజారే ఆందోళన, రిటైల్‌లోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ హడావుడి నిర్ణయంతో చేతులు కాల్చుకోవడం వంటి ఉదంతాలతో ఇప్పటికే అడుగంటిన యూపీఏ ప్రతిష్ట.. ఇలా సొంత, భాగస్వామ్య పక్షాల మంత్రులు వరుసబెట్టి కేసుల్లో ఇరుక్కుంటుండటంతో అథఃపాతాళానికి దిగజారుతోంది. చిదంబరంపైనా సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుండటంతో యూపీఏకు మరింత సంకటం తప్పేలా లేదు!

 

 నిన్నటిదాకా ఎఫ్‌డీఐ గోలతో అట్టుడికిన పార్లమెంటును గురువారం 2జీ కుంభకోణం కుదిపేసింది! ఇందులో చిదంబరం పాత్ర ఉందంటూ విపక్షాలన్నీ కేంద్రంపై ఒంటికాలిపై లేచాయి. ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామిని సాక్షిగా కోర్టు అనుమతించడాన్ని అందివచ్చిన అస్త్రంగా మలుచుకొని పెను గందరగోళం సృష్టించాయి. లోక్‌సభ ప్రారంభమవగానే ఎన్డీఏ సభ్యులు 2జీ కేసును లేవనెత్తారు. చిదంబరం రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినదించారు.

 

 ముళ్లపెరియార్ డ్యాంపై చర్చకు డిమాండ్ చేస్తూ ఇదే సమయంలో డీఎంకే ఎంపీలు సభామధ్యంలోకి దూసుకెళ్లారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12కు సమావేశమైన తర్వాతా అదే పరిస్థితి కొనసాగింది! ధరల పెరుగుదలపై చర్చకు సహకరించాల్సిందిగా పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2కు వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. ప్రశ్నోత్తరాలు కాసేపు సజావుగా సాగినా.. 2జీ ఉదంతంపై ఎన్డీఏ, లెఫ్ట్, అన్నాడీఎంకే సభ్యులంతా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దాంతో చైర్మన్ హమిద్ అన్సారీ సభను తొలుత 10 నిమిషాలకు, తర్వాత మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకుముందు కార్యక్రమాలు మొదలవగానే ఉభయ సభలూ ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు నివాళి అర్పించాయి.

 

 పార్లమెంటు సాగాలంటే గద్దె దిగాలి: బీజేపీ

 పార్లమెంటు సజావుగా సాగాలంటే చిదంబరం రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. తమ వైఖరి సరైందేనని ఢిల్లీ కోర్టు ఆదేశాలతో తేలిందని పేర్కొంది. 2జీ కుంభకోణంలో చిదంబరం పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. పదవిలో కొనసాగితే కేసు విచారణపై ఆయన ప్రభావం చూపుతారు గనుక రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి వ్యాఖ్యానించారు.

 

 డిమాండ్ అసమంజసం: ఖుర్షీద్

 చిదంబరం రాజీనామా డిమాండ్ సరికాదని కేంద్ర న్యాయ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. కోర్టు ఎక్కడా ఆయన్ను తప్పుపట్టలేదని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి హోదాను గౌరవించాలని, సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్షాలను కోరారు. చిదంబరం ప్రభుత్వంలో భాగమని, ఆయనకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రతిపక్షాలు చెబుతున్నట్టే కోర్టులో జరిగినా కూడా చిదంబరం రాజీనామా చేయనవసరం లేదని వ్యాఖ్యానించారు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి