రైల్వే సహాయ మంత్రి మునియప్ప వెల్లడి
సాధ్యాసాధ్యాల అధ్యయనం బాధ్యత జపాన్ కన్సార్షియానికి..
దేశవ్యాప్తంగా ఆరు హైస్పీడ్ కారిడార్లపై అధ్యయనానికి నిర్ణయం
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: భవిష్యత్తులో హైదరాబాద్- చెన్నై మధ్య అత్యంత వేగంతో కూడిన బుల్లెట్ రైలును నడిపేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించనుంది. దేశంలో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే ఉద్దేశంతో సాధ్యాసాధ్యాల అధ్యయనంకోసం మొత్తం ఆరు కారిడార్లను రైల్వేశాఖ ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్-చెన్నై కారిడార్ ఒకటి. దీని అధ్యయనం బాధ్యతను జపాన్‌కు చెందిన ఓ కన్సార్షియానికి అప్పగించింది. ఇందులో జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో), ఓరియంటల్ కన్సల్టెన్సీ, పార్సన్స్ బ్రింఖోఫ్ ఇండియా సంస్థలున్నాయి.
హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వరకు ఉన్న మార్గంలో హైస్పీడ్ ప్రయాణికుల రైలు నడపడానికి గల సాధ్యాసాధ్యాలపై ఈ కన్సార్షియం అధ్యయనం చేసి ఏడు నెలల్లోగా నివేదికను సమర్పిస్తుంది. ఇందుకోసం రైల్వేశాఖ రూ.3.5 కోట్లు వ్యయం చేయనుంది. ఈ విషయాన్ని రైల్వేశాఖ సహాయమంత్రి కె.హెచ్.మునియప్ప గురువారం లోక్‌సభలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆరు కారిడార్లపై అధ్యయనం చేయనున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు సంబంధించిన బిడ్లను ఆహ్వానించగా దేశ, విదేశీ సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. ఆరింటికిగాను నాలుగింటికి కన్సల్టెంట్ల ఎంపిక పూర్తయిందన్నారు. హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధ్యయనానికి ఎంపిక చేసిన కారిడార్లు, వాటిని చేపడుతున్న సంస్థల వివరాలివీ...
హైదరాబాద్-డోర్నకల్-విజయవాడ-చెన్నై (దాదాపు 664 కిమీ): జపాన్ కన్సార్షియం
పుణే-ముంబై-అహ్మదాబాద్ (దాదాపు 650 కిమీ): ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా
హౌరా-హాల్దియా (దాదాపు 135 కిమీ): స్పానిష్ సంస్థ ఎనెకో
ఢిల్లీ-ఆగ్రా-లక్నో-వారణాసి-పాట్నా (దాదాపు 991 కిమీ): బ్రిటన్‌కు చెందిన మాట్ మెక్‌డొనాల్డ్
ఇదిలా ఉండగా ఢిల్లీ-చండీగఢ్-అమృత్‌సర్ (దాదాపు 450 కిమీ), చెన్నై-బెంగళూరు-కోయంబత్తూరు-ఎర్నాకుళం-తిరువనంతపురం(దాదాపు 850 కిమీ) హైస్పీడ్ రైలు కారిడార్‌ల అధ్యయనం కోసం కన్సల్టెంట్లను ఎంపిక చేయాల్సి ఉంది.
జాతీయ హైస్పీడ్ రైలు అథారిటీ ఏర్పాటు..
దేశంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించడం, అమలు చేయడం, పర్యవేక్షించడానికి జాతీయ హైస్పీడ్ రైలు అథారిటీ(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఏ)ని నెలకొల్పాలని రైల్వేశాఖ నిర్ణయించినట్టు మునియప్ప తెలిపారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును వివిధ మంత్రిత్వశాఖల అభిప్రాయంకోసం రైల్వేశాఖ పంపనుంది. మొత్తంమీద వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు అవకాశమున్నట్టు సమాచారం.
తిమ్మాపూర్ పీఎఫ్‌టీని నోటిఫై చేశాం...
దేశవ్యాప్తంగా సరుకు రవాణా టెర్మినళ్ల నెట్‌వర్క్ వేగంగా వృద్ధి చెందేలా చూసేందుకు 2010 మేలో ప్రారంభించిన ప్రైవేట్ ఫ్రైట్ టెర్మినల్(పీఎఫ్‌టీ) పథకం కింద ఇప్పటివరకు 18 ప్రతిపాదనలు అందాయని మునియప్ప తెలిపారు. వీటిలో ఏడు ప్రతిపాదనలకు ఉత్తర, ఈశాన్య, మధ్య రైల్వే జోన్లు సూత్రప్రాయ అనుమతులిచ్చాయన్నారు. దక్షిణమధ్యరైల్వే పరిధిలోని తిమ్మాపూర్(మహబూబ్‌నగర్ జిల్లా) పీఎఫ్‌టీ ప్రతిపాదనను నోటిఫై చేసినట్టు తెలియజేశారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి