10, డిసెంబర్ 2011, శనివారం

మౌంట్ ఎడ్మండ్ ...సాక్షి ఫ్యామిలీ

 

 

ప్రకృతిని శోధించడంలో,

 సాధించడంలో మనిషి ఎప్పటికీ చిన్నపిల్లవాడే.

 ''ఎందుకు ఎవరెస్టును ఎక్కడం?'' అంటే -

 ''అది అక్కడ ఉంది కాబట్టి'' అంటారు

 ఈ పర్వతారోహకులంతా!!

 కానీ ఎడ్మండ్ హిల్లరీ... శిఖరాన్ని ఎక్కి దిగడంతో

 సరిపెట్టుకోలేదు.

 పర్వత ప్రాంత ప్రజలకు జీవితాంతం

 కొండంత అండగా నిలబడ్డారు.

 'ఫస్ట్ ఇన్ ది వరల్డ్' టైటిల్‌తో లక్షల డాలర్లు

 సేకరించి వారి దోసిళ్లలో పోశారు.

 ఇవాళ 'ఇంటర్నేషనల్ మౌంటేన్ డే'

 'మౌంట్ ఎడ్మండ్'ను తప్పనిసరిగా

 తలుచుకోవ లసిన డే.

 ఈవారం బయోగ్రఫీ ఆయనదే!

 

 

ఎవరెస్టు శిఖరం గురించి చిన్నప్పుడు మనం చదువుకున్నాం, ఎడ్మండ్ హిల్లరీ కూడా చదువుకున్నాడు. అయితే, ఎడ్మండ్ హిల్లరీ కన్నా మనం ఒక ఆకు ఎక్కువ చదివాం!

 

 1. {పపంచంలో అతి ఎత్తయిన శిఖరం... ఎవరెస్టు శిఖరం.

 2. ఎవరెస్టు శిఖరం ఎత్తు 8848 మీటర్లు. (29,029 అడుగులు).

 3. ఎత్తును లెక్కగట్టింది 'గ్రేట్ ట్రిగనామెట్రిక్ సర్వే ఆఫ్ బ్రిటిష్ ఇండియా' సంస్థ.

 4. లెక్క గట్టిన సంవత్సరం 1856.

 5. అప్పట్లో ఎవరెస్ట్ ఎవరెస్ట్ కాదు. పీక్ గీగ సర్ జార్జి ఎవరెస్ట్ అనే సర్వేయర్ జనరల్ పేరు మీద పీక్‌గీగకి రాయల్ జియోగ్రఫికల్ సొసైటీ వాళ్లు ఎవరెస్ట్ అనే పేరు పెట్టారు.

 6. ఎవరెస్ట్ శిఖరం ఉండేదెక్కడంటే... నేపాల్ - టిబెట్‌ల మధ్య, హిమాలయాలలో.

 7. లోకల్ లాంగ్వేజ్‌లో అది 'చోములుంగ్మా' పర్వతం.ఆ విషయం బ్రిటిష్ వాళ్లకు తెలీదు.

 8. చాలాకాలం వరకు నేపాల్, టిబెట్‌లలోకి

 విదేశీయులెవరికీ ప్రవేశం లేదు కనుక తెలీదు.

 ఎడ్మండ్ హిల్లరీ ఈ ఎనిమిది పాయింట్లే చదువుకున్నాడు. తొమ్మిదో పాయింట్ చదువుకోలేదు. దాన్ని మనం చదువుకున్నాం!

 9. ఎవరెస్టు శిఖరాన్ని మొదట అధిరోహించిన

 వ్యక్తి ఎడ్మండ్ హిల్లరీ.

 ఈ పాయింట్ దగ్గర ఎవరెస్ట్ జీవిత చరిత్ర ఆగిపోతుంది.

 ఇదే పాయింట్ దగ్గర ఎడ్మండ్ బయోగ్రఫీ మొదలౌతుంది.

 

*********

 ఎవరెస్ట్ ఎత్తు లెక్క తేలిన తర్వాత సుమారు ముప్పై ఏళ్లకు (1885లో) క్లింటన్ థామస్ డెంట్ అనే ఆయన 'ఎబౌ ది స్నో లైన్' అనే పుస్తకం రాశారు. అందులో ఒక లైన్ కుర్రాళ్లకు కిక్ ఇచ్చింది! 'ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం సాధ్యమే' అన్నది ఆ లైన్! అంతకుముందెవ్వరూ ఊహల్లో కూడా ఎవరెస్టును ఎక్కే సాహసం చెయ్యలేదు. థామస్ డెంట్ పుస్తకం వచ్చాక సాహస వీరుల క్లబ్బులు మొదలయ్యాయి.

 

థామస్ డెంట్ లండన్‌లోని ఆల్ప్స్ క్లబ్బుకు అధ్యక్షుడు. 1857లో ఆయనే దానిని స్థాపించాడు. కొండలు ఎక్కడంపై ఆసక్తి ఉన్నవాళ్లంతా రోజూ సాయంత్రం ఆ క్లబ్బుకు చేరుకునేవారు. కొండ కబుర్లు చెప్పుకునేవారు. బాగా చీకటి పడ్డాక ఇంటికి వెళ్లిపోయేవారు. డెంట్ పుస్తకం వచ్చాక పరిస్థితి మారింది. అప్పుడే ఇంటికా అనుకున్నారు! ఎవరెస్టును ఎక్కకుండా ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి అని బాధపడ్డారు!!

 

తర్వాత ముప్పై ఐదేళ్ల వరకు మాటలు తప్ప మనుషులెవరూ ఎవరెస్టును ఎక్కే ప్రయత్నం చెయ్యలేదు. మొదటి ప్రయత్నం 1921లో జరిగింది. జార్జి మల్లోరి అనే మౌంటెనీరుడు ఉత్తర దిక్కుకు పయనించి, అక్కడి నుంచి ఎవరెస్టు పైకి 7,007 మీటర్ల (22,989 అడుగులు) ఎత్తుకు చేరి, ఇక ఎక్కలేక వెనక్కి వచ్చేశాడు.

 

అప్పటికి ఎడ్మండ్ హిల్లరీ వయసు రెండేళ్లు.

 జార్జి మల్లోరి తర్వాత 1922లో జార్జి ఫించ్ అనే సాహసి ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని గంటకు 290 మీటర్ల (950 అడుగులు) వేగంతో 8, 320 మీటర్ల (27,300 అడుగులు) ఎత్తువరకు వెళ్లి, స్నేహప్రియంగా లేని గాలులతో తలపడలేక కిందికి దిగి వచ్చేశాడు.

 తర్వాత రెండేళ్లకు జార్జి మల్లోరి మళ్లీ సరకు సరంజామా పట్టుకుని వచ్చాడు. ఆండ్రూ ఇర్విన్ అనే సహచరుడితో కలిసి అధిరోహణకు బయల్దేరాడు. వెళ్లినవాళ్లు తిరిగి కనిపించలేదు. డెబ్బై ఐదేళ్ల తర్వాత 1999లో మంచుబొరియల్లో మల్లోరి మృతదేహం బయటపడింది! ఇర్విన్ ఎక్కడ సమాధి అయ్యాడో తెలీదు. అయితే వాళ్లు దాదాపుగా ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్న ఆనవాళ్లు శిఖరానికి కొన్ని వందల మీటర్ల దిగువన పరిశోధకులకు కనిపించాయి.

 

అప్పటికి ఎడ్మండ్ హిల్లరీ వయసు నాలుగేళ్లు.

 1933లో ఎవరెస్టును చేరుకోడానికి ఇంకో ప్రయత్నం జరిగింది. అయితే అది కింది నుంచి పైకి చేరుకోవడం కాదు! విమానంలోంచి శిఖరంపైకి వాలడం!! లేడీ హోస్టన్ అనే బ్రిటిష్ సంపన్నురాలు ఇచ్చిన విరాళంతో డగ్లాస్ హామిట్లన్ అనే వైమానిక సైనికాధికారి విమానంలో వెళ్లి యునెటైడ్ కింగ్‌డమ్ జెండాను ఎవరెస్టుపై నాటి వచ్చారు.

 అప్పటికి ఎడ్మండ్ హిల్లరీ వయసు పదమూడేళ్లు.

 

**********

 

 న్యూజిలాండ్‌లో ఎడ్మండ్ పుట్టిన ఆక్లాండ్ ప్రాంతానికీ, నేపాల్‌లో ఎవరెస్ట్ శిఖరం ఉన్న ఖాట్మండూకి మధ్య... విమానంలో పదిహేను గంటల దూరం. రోడ్డు మీద సుమారు పన్నెండు వేల కిలోమీటర్ల ప్రయాణం. భౌగోళిక శాస్త్రంలో ఎవరెస్టు శిఖరం గురించి చదవడం మినహా పదమూడేళ్ల ఎడ్మండ్‌కు అది ఏ మాత్రం సంబంధం లేని ప్రదేశం. వాళ్ల పూర్వీకులెవ్వరూ కొండలెక్కినవాళ్లు కారు. సాహసాలు చేసినవారు కారు.

 

ఎడ్మండ్ తండ్రి పెర్సివల్ ఆగస్టస్ హిల్లరీ మొదటి ప్రపంచ యుద్ధ సిపాయి. తల్లి గెర్‌ట్రూడ్ హిల్లరీ... తలుపు చాటు ఇల్లాలు. ఒట్టోమన్ (ఇప్పటి టర్కీ) రాజధాని కాన్‌స్టాంటినోపుల్‌ను ఆక్రమించుకునేందుకు గల్లిపొలి ద్వీపకల్పంలో బ్రిటిష్, ఫ్రెంచి సేనలు కలిసి చేసిన యుద్ధంలో సేవలు అందించినందుకు ఎడ్మండ్ తండ్రికి తువాకావ్‌లో కొంత భూమిని ఉచితంగా ఇచ్చింది ప్రభుత్వం. ఆ చెక్కను నమ్ముకుని తువాకావ్‌లో స్థిరపడిన కుటుంబమది.

 

ఎడ్మండ్ చురుకైనవాడు. అయితే ఆ చురుకుదనమే అతడిని 'డల్ స్టూడెంట్'గా మార్చింది! తువాకావ్‌లోని ప్రాథమిక పాఠశాలలో వయసుకు మించి రెండేళ్లు ఎక్కువ చదివిన ఎడ్మండ్... ఆ తర్వాత ఆక్లాండ్ గ్రామర్‌స్కూల్లో బాగా వెనుకబడి పోయాడు. పెద్ద పిల్లల మధ్య చిన్నపిల్లవాడు కాబట్టి ఎప్పుడూ బిక్కుబిక్కుమంటూ ఉండేవాడు. బిడియంగా మాట్లాడేవాడు. తోటి పిల్లల్ని తప్పించుకోడానికి పుస్తకాల్లో తలదూర్చేవాడు! అందరూ ఆడుకుంటుంటే ఎడ్మండ్ ఒక్కడే పుస్తకాలతో కనిపించేవాడు. అందరూ అల్లరి చేస్తుంటే ఎడ్మండ్ ఒక్కడే 'డీసెంట్'గా ఉండిపోయేవాడు. ఇంటి నుంచి బడికీ, బడి నుంచి ఇంటికీ రోజుకు నాలుగ్గంటల రైలు ప్రయాణం. స్కూల్లో చదువు, ప్రయాణంలో చదువు. చదువుతూ చదువుతూ స్కూల్లోంచి, రైల్లోంచి ఊహల్లోకి వెళ్లిపోయేవాడు. ఊహల్లోనే సాహసాలన్నీ ముగించుకుని వచ్చి వాస్తవంలో ఉసూరుమనేవాడు. మళ్లీ చదువు! ఊహల్లో అతడు ఎప్పుడూ చేసే ఒక సాహసం... క్లాస్‌రూమ్‌లో పొగరుబోతు పెద్దపిల్లల దవడలు పగలగొట్టడం, వీపులు వాయించడం.

 

ఆరడుగులకు పైగా ఉంటాడు ఎడ్మండ్. అంత ఎత్తై కుర్రాడికి గుండె ధైర్యం లేకపోతే నిండుదనం ఉండదని ఎవరో అన్నారు. ఆ మాట పట్టుకుని బాక్సింగ్ నేర్చుకున్నాడు ఎడ్మండ్. ధైర్యం వచ్చింది! అందరిలోనూ కలిిసిపోతున్నాడు. గలగల మాట్లాడుతున్నాడు. నేస్తగాళ్లను దబీదబీమని గుద్దుతున్నాడు. పెద్ద పిల్లలపై చనువుగా చేతులు వేస్తున్నాడు. చిన్నపిల్లల్ని చేతులపై తలకిందులు చేస్తూ నవ్విస్తున్నాడు. ఎడ్మండ్‌ని ఇష్టపడేవాళ్లు ఎక్కువయ్యారు. చదవడం తగ్గింది. ఊహలు తగ్గాయి. ఎడ్మండ్ మనసు క్రమంగా వాస్తవ జీవితంలోని సాహసాలను కోరుకుంటోంది.

 

ఇప్పుడతడి వయసు పదహారు.

 కొండల్ని పిండిచేసే ఉత్సాహంలో ఉన్నాడతడు. కానీ పిండి చెయ్యడం కన్నా, వాటిని ఎక్కడంలో మజా ఉంటుందని ఎడ్మండ్‌కు తొలిసారిగా మౌంట్ రువఫెయ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు తెలిసింది. న్యూజిలాండ్‌లోని అగ్నిపర్వతం రువఫెయ్. ఆ అగ్ని... ఎడ్మండ్‌లోని పర్వతారోహణ కాంక్షను రాజేసి, మౌంట్ ఆలివియర్ వైపు ఎగదోసింది.

 1939లో ఆక్లాండ్ యూనివర్శిటీ నుంచి మేథ్స్, సైన్స్ పట్టాతో బయటికి వచ్చిన ఎడ్మండ్.. గేటు బయటికి వచ్చీ రాగానే చేసిన పని ఉద్యోగం వెతుక్కోవడం కాదు. దక్షిణ ఆల్ప్స్ పర్వత శ్రేణులలోని మౌంట్ కుక్ సమీపంలో ఉన్న ఆలివియర్ శిఖరాన్ని అధిరోహించడం.

 

**********

 కొండల్ని ఎక్కడం శ్రమతో పని. సాహసంతో పని. డబ్బుతో పని.

 ఎడ్మండ్ శ్రమించగలడు. సాహసం చెయ్యగలడు. కానీ డబ్బు ఎలా సంపాదించాలో తెలీదు. ఎడ్మండ్‌కే కాదు, ఇరవైల ఆరంభంలో ఉన్న ఏ యువకుడికైనా డబ్బును సంపాదించడం పెద్ద పజిల్. కానీ లక్ష్యమే అన్నీ నేర్పుతుంది. జీవితానికొక లక్ష్యం ఉండాలనేది అందుకే. ఇక్కడ ఎడ్మండ్ లక్ష్యం... పెద్ద పెద్ద పర్వతాలన్నిటినీ ఎక్కేయడం.

 బాగా ఆలోచించాడు. తమ్ముడు రెక్స్‌తో కలిసి తేనెటీగల పెంపకం చేపట్టాడు ఎడ్మండ్. వేసవంతా పెంపకం. వింటర్‌లో కొండలు ఎక్కడం. సంపాదించినంత సంపాదించాడు. తిరిగినంత తిరిగాడు. చివరికి తేనెటీగలపై కృతజ్ఞతతో ప్రఖ్యాత శిల్పి మైఖేల్ ఏర్టాన్‌ను పిలిపించి పసిడివర్ణంలో ఉండేలా ఒక పెద్ద మైనపు తేనెతుట్టెను తయారుచేయించి న్యూజిలాండ్‌లోని తన పూలతోటలో పెట్టించాడు. చుట్టుపక్కల తేనెటీగలన్నీ అక్కడికి వచ్చేవి. వాటి పిల్లల్ని, సేకరించిన మధువుని అందులో దాచుకునేవి. రుణం తీర్చుకుంటున్నట్లు ఉండేది ఎడ్మండ్‌కి... ఆ మధురమైన దృశ్యాన్ని చూస్తుంటే.

 రోజులు గడుస్తున్నాయి. అప్పటికింకా ఎవరెస్టు మీద ఎడ్మండ్ దృష్టి పడలేదు. అందుకు రెండు కారణాలు.

 ఒకటి : ఎడ్మండ్ ఉద్యోగ ప్రయత్నంలో ఉండడం.

 ఇంకోటి : ఎవరెస్ట్ శిఖరం అక్కడికి వేల కిలో మీటర్ల దూరంలో ఉండడం.

 తేనెటీగల పెంపకం పార్ట్ టైమ్ ఉపాధి. పర్మినెంట్‌గా ఒక ఉద్యోగం కావాలి. ఎలా? పట్టా చేతిలో ఉందికానీ, లోక వ్యవహారాలు అతడికింకా అంతుపట్టలేదు.

 

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి దేశాలన్నీ ప్రశాంతంగా ఉన్న రోజుల్లో పుట్టినవాడు ఎడ్మండ్ హిల్లరీ. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యేనాటికి అతడు ఇరవై ఏళ్ల యువకుడు. 'ఎయిర్‌ఫోర్స్‌కి సైనికులు కావలెను' అనే ఉద్యోగ ప్రకటన చూసి అప్లయ్ చేశాడు. ఉద్యోగం రాబోతుండగా అతడికొక అనుమానం వచ్చింది. 'దేవుడు క్షమించే పనేనా ఇది' అని ఆలోచనలో పడ్డాడు. అప్లికేషన్ వెనక్కి తీసుకున్నాడు. కానీ, దెయ్యంలాంటి 'కాన్‌స్క్రిప్షన్' అతడిని బలవంతంగా యుద్ధంలోకి రప్పించింది. సైన్యంలో విధిగా చేరి తీరాలనే ఉత్తర్వే కాన్‌స్క్రిప్షన్. దాన్నతడు తప్పించుకోలేకపోయాడు.

 

1943లో పసిఫిక్ ప్రాంతంలో యుద్ధం ఉద్ధృతం అవగానే రాయల్ న్యూజిలాండ్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎడ్మండ్‌కు నేవిగేటర్‌గా బదిలీ అయింది. యుద్ధక్షేత్రంలో పెలైట్‌కు దారి చూపించడం నేవిగేటర్ పని. తర్వాత రెండేళ్లకు న్యూజిలాండ్ ప్రభుత్వం అతడిని ఫిజీకి పంపింది. అక్కడి నుంచి సొలొమన్ ఐలాండ్స్‌కి పంపింది. అక్కడ జరిగిన దాడిలో ఎడ్మండ్ ప్రయాణిస్తున్న ఫ్లయింగ్ బోట్‌కి మంటలు అంటుకున్నాయి. ఎడ్మండ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వం అతడిని సురక్షితంగా స్వదేశానికి తెప్పించుకుంది.

 యుద్ధం ఆగిపోయింది. మూడేళ్లు విశ్రాంతిగా గడిచాయి. ఎడ్మండ్ మనసు మళ్లీ కొండగాలి మీదికి మళ్లింది. హ్యారీ ఏరెస్, మిక్ సల్లివాన్, రూత్ ఆడమ్స్‌తో కలిసి 1948 జనవరి 30న న్యూజిలాండ్‌లోని ఎత్తై శిఖరం మౌంట్ కుక్‌ను ఎక్కాడు.

 తర్వాత 1952లో జార్జి లోవేతో కలిసి ఎరిక్ షిప్టన్ నాయకత్వంలో మౌంట్ చోయును అధిరోహించే ప్రయత్నం చేశాడు. ఎవరెస్ట్ శిఖరాని ఉత్తరం వైపున ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చోయూ. నైపాల్ వైపు నుంచి చోయూకి దారి లేదని అక్కడికి వెళ్లాక గానీ తెలియలేదు ఎడ్విన్ బృందానికి. ''అర్రే'' అని నాలుక కొరుక్కుని కిందికి దిగివచ్చారు.

 వీళ్లిక్కడ చోయును దిగుతున్న సమయానికి స్విట్జర్లాండ్ బృందం ఒకటి నేపాల్ వైపు నుంచి ఎవరెస్టును ఎక్కుతోంది! టెన్జింగ్ నార్గే అందులో ఉన్నాడు. అప్పటికి అతడెవరో ఎడ్మండ్‌కి తెలియదు. ఏడాదికొక్కసారి మాత్రమే పర్వతారోహకులను నేపాల్ అనుమతిస్తుంది. ఆ కోటాలో వచ్చిందే స్విస్ బృందం. టిబెట్ వైపు నుంచి ఎవరెస్టుకు ఉన్న దారిని చైనా మూసేసింది. ఎవరు ఎక్కినా నేపాల్ నుంచి ఎక్కాల్సిందే. ఇంకో 800 అడుగులు ఎక్కితే ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరుకుంటాం అనుకుంటుండగా ఏ దేవుడో ఉరిమి, వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి,

 స్విస్ బృందం వెనక్కి వచ్చేసింది.

 ఓటములు ఎన్నైనా ఎదురుకావచ్చు. కానీ, గెలవడానికి చేసిన ఒక్క ప్రయత్నం కూడా వృథాగా పోదు.

 1953లో ఎడ్మండ్‌కి, అతడి మిత్రుడు జార్జి లోవేకి ఒక వెచ్చని మధ్యాహ్నం 'జాయింట్ హిమాలయన్ కమిటీ' నుంచి ఒక లేఖ అందింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వచ్చిన ఆహ్వానం అది!!

 అప్పుడు ఎడ్మండ్ వయసు ముప్పై మూడేళ్లు.

 ఎడ్మండ్ జీవితాన్ని మలుపు తిప్పి, ఎవరెస్టు చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని జోడించిన ఆహ్వానం అది. ఎడ్మండ్‌తో పాటు లోవే జీవితం కూడా మలుపు తిరిగేదే కానీ, ఆఖరి నిమిషంలో అతడు వేరే జట్టులోకి వెళ్లవలసి వచ్చింది. లేదంటే ఇవాళ మనం ఎడ్మండ్ హిల్లరీతో పాటు టెన్జింగ్ నార్గేను కాకుండా జార్జి లోవే పేరును చెప్పుకుంటుండేవాళ్లం.

 1953 మార్చి 10న మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ (ఎవ రెస్ట్ సాహసయాత్ర) మొదలైంది. 400 మంది పర్వతారోహకులు ఉన్న ఈ బృందానికి బాస్.. కల్నల్ జాన్ హంట్.

 ''మిస్టర్ ఎడ్మండ్... మీరు, టెన్జింగ్ నార్గే కలిసి బృందంలోని ఒక జట్టును లీడ్ చేయబోతున్నారు'' అన్నారు కల్నల్. బహుశా అప్పుడతడికి తెలియకపోవచ్చు ఇదే జట్టు ఎవరెస్టును జయించబోతోందని!

 

********** ఖాట్మండూ నుంచి ఎవరెస్టు ప్రాంతానికి పెద్ద గుంపుగా బయల్దేరింది ఎక్స్‌పెడిషన్. ఆ ప్రాంత ప్రజలకు ఇలాంటి దృశ్యాలు మామూలే. ఏళ్లుగా ఆ ఎవరెస్టునూ చూస్తున్నారు. ఈ గుంపుల్నీ చూస్తున్నారు. ఎవరైనా ఎప్పటికైనా శిఖరాన్ని చేరుకుంటారా అని వాళ్లు ఏనాడైనా ఆలోచించారో లేదో కానీ, వెళ్లిన వాళ్లంతా క్షేమంగా తిరిగిరావాలని మాత్రం కోరుకుంటారు. అందుకు కారణం ఉంది. వెళ్లిన ప్రతి ఆరుగురిలో కచ్చితంగా ఒకరు తిరిగిరారు! వచ్చినవాళ్లకైనా కాళ్లు, చేతులు సక్రమంగా ఉంటాయో లేదో తెలీదు!

 

హిమాలయాలు ఎంత చల్లనివో అంత ప్రమాదకరమైనవి. మంచు మాటున కనిపించని అగాధాలు పొంచి ఉంటాయి. ఎక్కుతున్న ప్రదేశం కొన్నిచోట్ల నిట్ట నిలువుగా ఉంటుంది. అడుగు తీసి అడుగువేసేలోపే శీతోష్ణస్థితులు మారిపోతుంటాయి. మంచుచరియలు విరిగిపడుతుంటాయి. మనిషిని మాయం చేసే బొరియలు ఉంటాయి. కాళ్లను నోట కరిచే నెర్రెలు ఉంటాయి. మంచు తుపానులు ఈడ్చుకు పోతుంటాయి. ఈ మహా శిఖరం ముందు మనిషి ప్రాణం ఎంత అల్పం! కానీ పర్వతారోహకులను ఈ పరిస్థితులేవీ నిరాశ పరచవు! ఫైటింగ్ స్పిరిట్‌తో ముందుకు వెళతారు. ''ఎందుకింత కష్టం? ప్రాణాలకు తెగించి అంత పెద్ద శిఖరాన్ని ఎందుకు ఎక్కడం?'' అని అడిగితే, ''అది అక్కడుంది కాబట్టి'' అంటారు జార్జిమల్లోరి వంటి సాహసికులు. అలాంటి సాహసమే ఇప్పుడీ ఎక్స్‌పెడిషన్‌ని నడిపిస్తోంది. ఏడున్నర టన్నుల బరువైన సామగ్రిని వీపుల మీద మోసుకుంటూ దాదాపు నూటా డెబ్బయ్ ఐదు మైళ్లు ప్రయాణించి ఎవరెస్టు ద్వారం దగ్గరకు చేరుకున్నారు పర్వతారోహకులు. మూడు నెలలకు సరిపడా తిండి, ఎమర్జెనీ కిట్‌లు వారిదగ్గరున్నాయి. ప్రయాణంలోని తొలిద శ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. చిన్న చిన్న పల్లెలు చిరునవ్వుతో వారిని పలకరించాయి. పూలతోటలు బెస్టాఫ్ లక్ చెప్పాయి. బృందం రెండు జట్లుగా విడిపోయి ముందుకు బయల్దేరింది.

 

ఒక జట్టుకు నాయకత్వం టామ్ బోర్డిలాన్, చార్లెస్ ఇవాన్స్. ఇంకో జట్టుకు ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే.

 ఇది జట్ల మధ్య పోటీ కాదు. అన్ని అవకాశాల నుంచీ ఎవరెస్టును అధిరోహించేందుకు చేసే ప్రయత్నం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలకూడదన్న కృత నిశ్చయం. మధ్యమధ్య స్వల్ప విరామాలతో ఏడు రోజులు ప్రయాణించి ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడి నుంచి ఎవరెస్టు కనిపిస్తోంది!

 

ఎవరెస్ట్... ఎట్ ఫస్ట్ సైట్!!!

 బాబోయ్ ఇంత పెద్ద శిఖరాన్నా మనం ఎక్కబోతున్నాం అని ఎక్స్‌పెడిషన్‌లో ఒక్కరూ అనుకోలేదు. ఇంత అందమైన శిఖరాన్నా చేరుకోబోతున్నాం అని పులకరించిపోయారు. అక్కడి నుంచి మళ్లీ తొమ్మిది రోజుల ప్రయాణం. పన్నెండు వేల అడుగుల పైకి వచ్చేశారు. త్యాంగ్‌బోచే అనే ప్రదేశం అది. అక్కడేదో ఆరామం ఉంది. అక్కడ పచ్చిక ఉంది! పచ్చికలో పశువులు మేస్తున్నాయి. కొండ మీద కాకుండా భూమి మీదే ఉన్నట్లుంది పర్వతారోహకులకు.

 

''అసలు ప్రయాణం ఇక్కడి నుంచే మొదలౌతుంది'' అన్నారు షేర్పాలు. ఎక్స్‌పెడిషన్‌లో భాగమై ఉన్న గైడ్‌లు వీరు.

 ఎత్తులకు వెళ్లే కొద్దీ ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకుని ముందుకు సాగేందుకు అవసరమైన తర్ఫీదును శరీరాలకు ఇవ్వడం కోసం రెండు జట్లూ కలిసి ఇక్కడే మూడు వారాలు గడిపాయి. ఆక్సిజన్ మాస్క్‌లను అమర్చుకునే విధానంపై కూడా అందరూ రెండు మూడు రిహార్సల్స్ వేసుకుని చూసుకున్నారు.

 

మళ్లీ ప్రయాణం.

 ఏప్రిల్ 12 నాటికి జట్లు 17, 900 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి. అక్కడే తొలి బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాయి. బేస్ క్యాంప్ అంటే ఇంత తిని, కాస్త విశ్రాంతి తీసుకునే ప్రదేశం. ఖుంబు ఐస్‌ఫాల్ అక్కడికి దగ్గర్లోనే ఉంది. ఎవరెస్ట్‌ను ఎక్కడానికి ప్రధాన అవరోధం ఇదే! దాన్నుంచి తప్పించుకుంటే చాలు. ఎంత కష్టమైనా పడి శిఖరం చేరొచ్చు. కానీ ఖుంబు హిమపాతాన్ని దాటటం తేలిక కాదు. కాళ్ల కింద అనుక్షణం ఖుంబు మంచుఖండం కదులుతూ ఉంటుంది. మనిషిని ఎప్పుడు ఎటు తీసుకుపోతుందో తెలీదు. ఎక్కడ బీటలు వారుతుందో తెలీదు. ఖుంబుపై కాలు పడిందంటే ఏదీ మన అదుపులో ఉండదు. అంతా విధి అధీనం.

 

అదృష్టం! ఆవేళ ఖుంబు కరుణించింది. కదిలింది కానీ, నెమ్మదిగా కదిలింది! దాన్ని దాటి సేఫ్ జోన్‌లోకి వచ్చేసింది బృందమంతా. ముందు జాగ్రత్తగా వాళ్లు ఏర్పాటు చేసుకున్న రెండో బేస్ క్యాంప్‌తో పెద్దగా పని పడలేదు. ఖుంబును దాటాక మరికాస్త పెకైళ్లి మూడో బేస్ క్యాంప్‌లో హై ఆల్టిట్యూడ్ బూట్లు వేసుకున్నారు. (మధ్యలో ఎదురైన బెర్గ్‌స్క్రండ్ మంచుఖండపు నెర్రెను నిచ్చెనతో దాటారు).

 

మళ్లీ అక్కడి నుంచి ప్రయాణం.

 నిలకడగా 21, 200 అడుగుల ఎత్తుకు చేరుకున్నారు. ఇక మిగిలింది 7829 అడుగులే. కానీ అక్కడ ఇంకొ బేస్‌క్యాంప్ అవసరం అయింది వారికి! ఫైనల్ క్లైంబింగ్‌కి కావలసిన అడ్వాన్స్‌డ్ బేస్ క్యాంప్ అది! మేఘాలు గడ్డకట్టేంత స్థాయికి ఉష్ణోగ్రత పడిపోయింది. మంచుగాలులు నిర్దాక్షిణ్యంగా ముఖానికొచ్చి తగులుతున్నాయి. వాటినన్నిటినీ కాచుకోవడానికి నాల్గవ బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకుంది ఎక్స్‌పెడిషన్ బృందం.

 మే 26 న టామ్ బోర్డిల్లన్, చార్లెస్ ఇవాన్స్ మరింత ముందుకు బయల్దేరారు. అంతకు ముందు ఏడాది స్విస్ బృందం చేరుకున్న పాయింట్ వరకూ ఈ జట్టు వెళ్లగలిగింది. ఇక నిలువుగా 300 అడుగులు ఎక్కితే శిఖరాగ్రమే. కానీ హిమాలయాలు ఈ జట్టును పైకి రానివ్వలేదు!

 

మరో రెండు రోజులు గడిచాయి. ఎక్కడివారు అక్కడే ఉండిపోతున్నారు. కొందరైతే బేస్‌క్యాంప్‌కే పరిమితమైపోయారు. మరోవైపు ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే రెండు మూడు ప్రయత్నాలు చేసి ఇంకొక్క వంద అడుగులు ముందుకు వేయగలిగారు.

 

మిగిలింది రెండొందల అడుగులు! ఎడ్మండ్ జట్టు బోర్డిల్లన్ జట్టుకన్నా వంద అడుగులు ముందున్న మాట నిజమే కానీ, ఇక అక్కడి నుంచి కదల్లేకపోతోంది. పర్వతాన్ని అంటుకుని పైకి ఎక్కడానికి కాళ్లకు, చేతులకు పట్టు దొరకడం లేదు. ఎడ్మండ్ జట్టులోని ఐదుగురు సభ్యులు అతికష్టం మీద ఈ ఇద్దరికోసం ఐదో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. మెల్లిగా అక్కడికి చేరుకున్నారు ఎడ్మండ్, నార్గే.

 

మే 29 రాత్రి.

 నిద్రముంచుకొస్తోంది కానీ కనురెప్పలు పడడం లేదు. ఆక్సిజన్ పీలుస్తున్నారు కానీ శ్వాస అందట్లేదు. కొయ్య మధ్య చీలికలో ఇరుక్కుపోయిన మేకుల్లా ఇద్దరూ బేస్‌క్యాంప్ గుడారంలో చిక్కుకుపోయారు. దేహాలు నిర్జలీకరణ చెందుతున్నాయి. గొంతు తడారిపోతోంది! బతకడం కష్టమేనని తెలుస్తోంది. శిఖరానికి దగ్గర్లోనే ఉన్నామన్న సంతోషం ఒక్కటే ఆ వేళ వారిని సజీవంగా ఉంచుతోంది. డబ్బాల మూతలు తెరచి, తేలికపాటి రసాయనాలలో నిల్వ ఉంచిన ఆప్రికాట్ పండ్లను, సార్టిన్ చేపలతో చేసిన రుచికరమైన పదార్థాలను, ఖర్జూరాలను, బిస్కెట్లను తిన్నారు. ఇంకా ఇంకా ఆకలి అవుతోంది. దాహం వేస్తోంది. వెంట తెచ్చుకున్న ద్రవాలనన్నిటినీ చుక్క మిగల్చకుండా తాగేశారు. కడుపు నిండాక ఎప్పటికో నిద్రపట్టింది. కళ్లు తెరచి చూసేసరికి

 

ఉదయం 6.30.

గుడారం నుంచి మెల్లిగా పాక్కుంటూ బయటికి వచ్చారు ఎడ్మండ్, నార్గే. ఒకసారి చచ్చిబతికాక ఇక చావుకు భయమేమిటి? మంచుతో ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారు. అడుగు మీద అడుగు వేసుకుంటూ వడివడిగా, కసిగా ఉదయం తొమ్మిది గంటలకు దక్షిణ శిఖరాగ్రానికి చేరుకున్నారు. అసలు పోరాట అక్కడ మొదలయింది. చుట్టూ ఇంకా సమాంతరంగా కొండలు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే అది శిఖరాగ్రం కాదు. మళ్లీ ఎక్కడం ప్రారంభించారు. క్రమంగా వాతావరణం తేలికపడుతోంది. ఆకాశం స్వచ్ఛంగా కనిపిస్తోంది. గాలుల వేగం తగ్గింది. పైన శూన్యం తప్ప ఏమీ కనిపించడం లేదు. కాళ్ల కింద బల్లపరుపుగా ఉన్న ఏకశిల!

 

11.30 అయింది.

 మొదట ఎడ్మండ్ హిల్లరీ ఆ ఏకశిల అంచులను పట్టుకుని పైకి లేచాడు. వెనకే టెన్జింగ్ నార్గే ఎక్కాడు. ప్రపంచంలోనే అతి ఎత్తై ఎవరెస్ట్ శిఖరం మీదకు మనిషి చేరుకున్న తొలి క్షణాలవి!! ఎడ్మండ్ గంభీరమైన మనిషి. అంత పెద్ద విజయం సాధించి కూడా అయన పెద్దగా అరవలేదు. ఎగిరి గంతేయలేదు. కొద్దిపాటి సంతోషాన్ని కనబరుస్తూ నార్గే చేతిని పట్టుకుని ఊపాడు.

 ''ఇది సరిపోదు'' అన్నాడు నార్గే! ఎడ్మండ్‌ను గట్టిగా కావలించుకున్నాడు.

 

మరికొన్ని క్షణాలు అయ్యాక ఎడ్మండ్ తన కోటు లోపలి నుంచి కలర్‌ఫిల్మ్ లోడ్ చేసి ఉన్న కెమెరాను బయటికి తీశాడు. మంచుగొడ్డలిని ఎత్తిపట్టుకుని ఉన్న టెన్జింగ్ నార్గేని ఫొటో తీశాడు. బ్రిటన్, నేపాల్, ఐక్యరాజ్య సమితి పతాకాలు కట్టి ఉన్న గొడ్డలి అది. టెన్జింగ్ చిన్న గొయ్యి తవ్వి బౌద్ధుల దేవుళ్లకు నమస్కరించి గొడ్డలిని అందులో దిగ్గొట్టాడు. ఎక్స్‌పెడిషన్ లీడర్ కల్నల్ జాన్ హంట్ ఇచ్చిన శిలువ గుర్తును భక్తితో ఆ ప్రదేశంలో ఉంచాడు ఎడ్మండ్. పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఎడ్మండ్, నార్గేల హృదయాలు ఉప్పొంగుతున్నాయి. విస్మయం, ఆశ్చర్యం, వినయం, ఔన్యత్నం, ఆత్మకీర్తి ... ఇలా అనేక భావాల కలయిక వారిని కుదిపి కుదిపి ఊపుతోంది.

 

********

 

 ఎవరెస్టును ఎక్కి వచ్చాక... ఎడ్మండ్, నార్గే ప్రపంచ పర్వత వీరులయ్యారు. అయితే మీ ఇద్దరిలో మొదటి వీరుడెవ్వరని ప్రపంచం ఎడ్మండ్‌ని అడిగింది.

 ''ఇద్దరం కలిసే ఎక్కాం'' అనేదే ఆయన సమాధానం. ఎప్పుడు చెప్పినా, ఎవరికి చెప్పినా.

 1986లో నార్గే మరణించిన పదమూడేళ్ల తర్వాత గానీ - 'మొదటి' అనే క్రెడిట్‌ను స్వీకరించలేకపోయారు ఎడ్మండ్. అదికూడా ఆయన నేరుగా చెప్పలేదు. 'వ్యూ ఫ్రమ్ ది సమ్మిట్' అనే పుస్తకంలో ఆనాటి శిఖర క్షణాలను పొందుపరుస్తున్నప్పుడు అప్రమేయంగా బయటపడిన వాస్తవం అది. నార్గే అంటే ఎడ్మండ్‌కు అంతులేని అభిమానం. నేపాల్ షేర్పా కుటుంబాలకు, కొండప్రాంత ప్రజలకు ఎడ్మండ్ చేసిన సేవల్లో, కల్పించిన సదుపాయాలలో ఆ అభిమానం కనిపిస్తుంది. ఎవరెస్ట్ పర్వతారోహణ తర్వాత ఎడ్మండ్ తన జీవితాన్నంతా వారి మధ్యనే గడిపారు. హిమాలయన్ ట్రస్టును నెలకొల్పి పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించారు.

 

ఎడ్మండ్‌కు తరచు ఇంకో ప్రశ్న కూడా ఎదురయ్యేది... ఎవరెస్టుపైన ఆవేళ మీరెందుకు ఫొటో దిగలేదని!

 ''మీరు నార్గే ఫొటో తీసినప్పుడు, నార్గే చేత మీరు కూడా ఒక ఫొటో తీయించుకుని ఉండొచ్చు కదా'' అనే ప్రశ్నకు జవాబుగా ఎడ్మండ్ చిన్నగా నవ్వేవారు. ''అంతకుముందెప్పుడూ నార్గే ఫొటోలు తియ్యలేదు. ఫొటోలు ఎలా తియ్యాలో నేర్పే సమయం, సందర్భం, స్థలం కాదు కదా'' అనేవారు.

 

నిజానికి కెమెరాను నార్గే చేతికి ఇచ్చి ఒక్క క్లిక్ కొట్టించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయితే ఎడ్మండ్ దానికంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ''పర్వతాన్ని కాదు, మమ్మల్ని మేము అధిరోహించాం'' అని వినయంగా చెప్పుకున్న ఎడ్మండ్... నార్గే ఫొటోనైనా ఎందుకు తీశాడంటే - సంఘటనకు ఒక సాక్ష్యం కావాలి కదా, అందుకు!

 1975లో రాసుకున్న ఆత్మకథ 'నథింగ్ వెంచర్, నథింగ్ విన్' లో ఆయన ఈ వివరణ ఇచ్చుకున్నారు.

 ''మిస్టర్ ఎడ్'' అని పిలిపించుకోవడం ఎడ్మండ్ హిల్లరీకి ఇష్టం. ఎంత ఎత్తుకు చేరినా మనిషి మనిషిగా ఉండడమే నిజానికి శిఖరాగ్రాన్ని చేరడం అంటారు ఎడ్మండ్.

 

ఎనభై ఎనిమిదేళ్ల వయసులో 2008లో ఆయన చనిపోయారు. ఎడ్మండ్ 'శిఖరైక్యం' పొందారని అనడానికి కూడా లేకుండా ఆయన తన మరణాన్ని సైతం నిరాడంబరీకరించుకున్నారు! తన చితాభస్మాన్ని హిమాలయాలలో కాకుండా, ఆక్లాండ్‌లోని మైటమాటా హార్బర్‌లో కలపాలని కోరుకున్నారు. ''నేను పుట్టిన ప్రదేశంలో తీరం వెంబడి నిమ్మళంగా ప్రవహిస్తుండే జలాలపై ప్రశాంతంగా పయనించే అస్థికలు నా జన్మను పరిపూర్ణం చేస్తాయి'' అని ఎడ్మండ్ తన ఆత్మకథలో రాసుకున్నారు. అంతా ఆయన అనుకున్న ప్రకారమే జరిగింది.

 

********

 

 చితాభస్మాన్ని ఆక్లాండ్‌లో కలపాలని కోరుకున్న ఎడ్మండ్ తన జీవిత చరమాంకం వరకు ఉన్నది మాత్రం నేపాల్ కొండ ప్రజల మధ్యనే. 1953 నుంచి వరుసగా ఆయన 54 ఏళ్ల పాటు నేపాల్‌ను సందర్శిస్తూనే ఉన్నారు. 120 సార్లకు పైగా ఇక్కడికి వెళ్లి వచ్చారు. ఏ ఒక్క సందర్శనలోనూ స్థానికుల నుంచి స్వాగత సత్కారాలను ఆశించలేదు. పైగా అలాంటి ఏర్పాట్లు ఏవైనా జరుగుతున్నాయని తెలిస్తే - ''డబ్బునెందుకు వృథా చేస్తారు?'' అని మృదువుగా మందలించేవారు. హిమాలయన్ ట్రస్టు ద్వారా సేకరించిన విరాళాల్లో ప్రతి డాలర్‌ను ఆయన నేపాలీయుల కోసమే ఉపయోగించారు. ఒక విధంగా తన జీవితాన్నే ధారపోశారు! 1975 మార్చి 31న ఆక్లాండ్ నుంచి నేపాల్‌కు వస్తున్న ఎడ్మండ్ భార్య లూయిస్ (43), కుమార్తె బెలిండా (16) విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కూడా నేపాల్‌కు ఆయన రాకపోకలు ఆగలేదు.

 

విజయాలకంటే, విజయశిఖరాల కంటే మనుషులు ముఖ్యం అంటారు ఎడ్మండ్. అందుకే ఆయన శిఖరసమానుడు అయ్యారు. అయితే ఆ మాటను కూడా ఒప్పుకోరు ఎడ్మండ్. ''నేనొక సామాన్యుడిని'' అంటారు. ఆ సామాన్యుడిని నేపాల్ ప్రజలు ఆత్మీయంగా 'బుర్రా సాహిబ్' అని పిలుచుకున్నారు. అంటే పెద్ద మనిషి అని! ఆయన ఎత్తును చూసి వారు అలాంటి పేరు పెట్టుకున్నా, విశాలమైన ఆయన హృదయాన్ని కూడా వెల్లడించే పిలుపు అది!

 

బుర్రా సాహెబ్ చనిపోయిన రోజు ఎవరెస్టు శిఖరం ఏమనుకుని ఉంటుంది? పొద్దుపోతున్నా ఈ మనిషి జాడ లేదేమిటా అని అప్పటికి కొన్ని రోజులుగా వేసుకుంటున్న ప్రశ్ననే ఆవేళా వేసుకుని ఉంటుందా?! ఆక్లాండ్ సిటీ హాస్పిటల్లో ఉదయం తొమ్మిది గంటలకు ఎడ్మండ్ హిల్లరీ ఆంతిమశ్వాస తీసుకున్నారు. కొన్ని గంటల్లోనే దట్టమైన విషాదం ఎవరెస్టు గ్రామాలను మంచులా కమ్మేసింది.

 ''ఎడ్మండ్ హిల్లరీ మహోన్నతుడు'' అని న్యూజిలాండ్ ప్రధాని హెలెన్ క్లార్ట్ నివాళులు అర్పించారు.

 ఆ మాట నిజమేననిపిస్తుంది.

 8848 మీటర్ల ఎత్తు తర్వాత ఎవరెస్టు పైన ఇంకేమీ ఉండదు.

 88వ యేట వరకు పరోపకారమే ధ్యేయంగా జీవించిన ఎడ్మండ్ ఏ మీటర్లకూ అందరు.

 - సాక్షి ఫ్యామిలీ

 

 సర్ ఎడ్మండ్ (పెర్సివల్) హిల్లరీ, పర్వతారోహకుడు

 20 జూలై 1919 - 11 జనవరి 2008

 

జన్మస్థలం : ఆక్లాండ్, న్యూజిలాండ్

తల్లిదండ్రులు : అగస్టస్ హిల్లరీ, గెర్‌ట్రూడ్ హిల్లరీ

జీవితభాగస్వామి: లూయీ మేరీ రోజ్ (1953 - 1975)జూన్ మల్‌గ్రూ (1989 - 2008)

 (అంటార్కిటిక్ విమాన ప్రమాదంలో మరణించిన ఎడ్మండ్ ప్రాణస్నేహితుడు పీటర్ మల్‌గ్రూ భార్య)

పిల్లలు : పీటర్ (జననం 1954), సారా (జననం 1955) బెలిండా (1959 - 1975)

ప్రఖ్యాతి : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి

 

ప్రతిష్ఠ : 20వ శతాబ్దపు అత్యంత ప్రభావశీలురైన వందమందిలో ఒకరిగా టైమ్ మేగ జీన్ గుర్తింపు

 

మరణ కారణం : గుండెపోటు

 

ఊహించని మలుపులు

1961లో నేపాల్‌లోని మకాలు శిఖరాన్ని అధిరోహిస్తున్నప్పుడు ఎడ్మండ్ తేలికపాటి సెరెబ్రల్ స్ట్రోక్‌కి గురయ్యారు. (మకాలు ఎత్తు 8,470 మీటర్లు)

 

1979లో ఆక్లాండ్ నుంచి అంటార్కిటికా వెళుతున్న సైట్‌సీయింగ్ విమానంలో ఎడ్మండ్ కామెంటేటర్‌గా ఎంపికయ్యారు. అయితే వేరే ముఖ్యమైన పనుల వల్ల ఆఖరి నిమిషంలో ఎడ్మండ్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి ఆయన స్నేహితుడు పీటర్ మల్‌గ్రూ వెళ్లవలసి వచ్చింది. ఆ విమానం ప్రమాదానికి గురై పీటర్‌తో పాటు 256 మంది ప్రయాణికులు మరణించారు. తర్వాత పీటర్ భార్యను ఎడ్మండ్ వివాహమాడారు.

 

ఎడ్మండ్ చివరిసారిగా 2007 ఏప్రిల్లో హిమాలయాలను సందర్శించారు. 2008 జనవరిలో మరణించారు.

 

చేరుకున్న శిఖరాలు

ఎడ్మండ్ హిల్లరీ 1984లో ఇండియాకు న్యూజిలాండ్ హైకమిషనర్‌గా నియమితులయ్యారు.

 

హిమాలయ పర్వత ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన 'అమెరికన్ హిమాలయ్ ఫౌండేషన్'కు ఎడ్మండ్ గౌరవ అధ్యక్షునిగా ఉన్నారు.

 

న్యూజిలాండ్ ప్రభుత్వం ఐదు డాలర్ల నోటు మీద ఎడ్మండ్ ముఖచిత్రాన్ని ముద్రించింది. ప్రముఖులు బతికుండగా వారి ఫొటోలను కరెన్సీనోటుపై ముద్రించడం అదే ప్రథమం!

 

{బిటిష్ రాజకుటుంబం ఎడ్మండ్‌ను అనేక బిరుదులతో గౌరవించింది.

 

క్వీన్ ఎలిజబెత్ -2 పట్టాభిషేక సమయంలోనే సరిగ్గా ఎడ్మండ్ హిల్లరీ ఎవరెస్టు ఘనతను సాధించడంతో రాజవేడుకల్లో భాగంగా ఆయన్నీ సత్కరించారు.

 

1987లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 500 మంది భూగోళ సంరక్షకులలో ఎడ్మండ్ కూడా ఒకరు.

 

పాటించిన విలువలు పాణాపాయంలో ఉన్న సాటి పర్వతారోహకుడి కన్నా లక్ష్యాన్ని చేరుకోవడం ముఖ్యం కాదని ఎడ్మండ్ నమ్ముతారు.

 

{పపంచ ప్రఖ్యాతి గాంచిన పర్వతారోహకుల సరసన ఉండేందుకు ఎడ్మండ్ బిడియపడతారు. తనొక సాధారణమైన, కొండలెక్కే మనిషిని మాత్రమేనని చెప్పుకుంటారు.

 

జీవితంలో ఏదైనా సాధించడానికి మేధస్సు అవసరం లేదని, చిత్తశుద్ధితో కృషి చేస్తే చాలని ఎడ్మండ్ తరచు స్కూలు పిల్లలకు చెప్పేవారు.

 

నేపాల్‌లో ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల స్థాపనకు ఏటా లక్షల డాలర్ల విరాళాలను సమకూర్చేవారు.

 

హిమాలయన్ ట్రస్టు తరఫున విరాళాలు సేకరించేందుకు అమెరికా, ఐరోపా దేశాలలో పర్యటిస్తున్నప్పుడు ఎడ్మండ్ మూడు నెలల వ్యవధిలో కనీసం వంద ప్రదేశాలలో ప్రసంగం ఇచ్చేవారు.

 

మరికొన్ని విశేషాలు

ఎడ్మండ్ హిల్లరీ పాస్‌పోర్ట్ మీద 'ఆథర్ - లెక్చరర్' అని ఉంటుంది.

 

రిస్క్‌లను కంట్రోల్ చెయ్యడంలో ఎడ్మండ్ సిద్ధహస్తుడు. ఆయన జీవితకాలంలో ఆయన వెంబడి పర్వతారోహణకు వెళ్లిన వారంతా సురక్షితంగా గమ్యం చేరుకుని తిరిగివచ్చినవారే!

 

పర్వతారోహకుల వినియోగం వల్ల కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ఆక్సిజన్ బాటిళ్లు, ఫుడ్ కంటెయినర్‌లు, ఇతర చెత్తాచెదారాలను తొలగించి హిమాలయాల శుభ్రతను కాపాడేందుకు ఎడ్మండ్... ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. ఫలితం సాధించారు.

 

జెట్ బోట్‌లో గంగానది విహార సాహసయాత్ర పూర్తి చేశాక ఎడ్మండ్ 1979లో 'ఓషన్ టు ది స్కై' అనే పుస్తకం రాశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి