13, డిసెంబర్ 2011, మంగళవారం

వేసవిలో రవితేజ హంగామా

 'నిప్పు'తో సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికే ఓ బెర్త్‌ని రెడీ చేసుకున్న రవితేజ... వేసవి హంగామాలో కూడా తన సినిమా ఉండేలా కెరీర్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ 'నిప్పు'తో పాటు 'శౌర్యం'ఫేం శివ దర్శకత్వంలో బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో కూడా ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

 

 ''మాస్‌లో రవితేజాకు ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని వాణిజ్య అంశాలతో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమాను తెరకెకిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే కథ ఇది. ఇందులో రవితేజ పాత్రలో ఐదు రకాల షేడ్స్ ఉంటాయి. ఈ తరహా పాత్ర చేయడం కూడా ఆయనకిదే ప్రథమం. ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరిస్తాయి. హైదరాబాద్, చెన్నయ్‌ల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. నిన్నటి నుంచి రెండో షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్, బ్యాంకాక్, బదామీల్లో జరిగే ఈ భారీ షెడ్యూల్‌తో టాకీ పూర్తి అవుతుంది. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం'' అని దర్శకుడు తెలిపారు.

 

 తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. సయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, సన తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ, కథనం: శివ, మాటలు: రమేష్‌గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతంరాజు, కెమెరా: అనిల్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి