9, డిసెంబర్ 2011, శుక్రవారం

ఆ పుస్తకం రూ. 1. 75 కోట్లు

క్రిెకట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ జీవిత చరిత్రపై రూపొందించిన తొలి కాపీ కోసం రూ. 1.75 కోట్లకు బిడ్గ దాఖలైంది. క్రిెకట్‌పై రూపొందించిన ఓ పుస్తకం ఇంత ధర పలకడం ఇదే మెుదటిసారి. 700 పేజీలతో 37 కిలోల బరువు ఉండే ఈ భారీ పుస్తకాన్ని దక్కించుకునేందుకు గతంలోనే ఓ వ్యక్తి రూ. 1.25 కోట్లకు బిడ్గ దాఖలు చేశారు. తాజాగా మరో వ్యక్తి ఇంత మెుత్తానికి బిడ్గ వేయడం విశేషం. సచిన్‌పై పుస్తకం రూపొందిస్తున్న ఓపస్‌ మీడియా గ్రూప్‌ సీఈఓ కార్ల్‌ ఫోలర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పుస్తకం కావాలంటూ నాలుగేళ్ళ క్రితం నుంచే ఓపస్‌ సంస్థకు ఆర్డర్లు రావడం విశేషం. ఈ పుస్తకంలో ఉన్న విశేషాలేంటో చూద్దాం!

 

ఈ దాహం తీరనిది...అంటూ రికార్డుల వెంట సచిన్‌ పరుగులు తీయడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. ఆయన పుట్టిందే రికార్డులు సృష్టించడానికి అనే అనుమానం కలుగుతుంది. క్రికెట్‌ ప్రపంచంలో ఇప్పటి వరకూ మరెవ్వరూ సాధించలేకపోయిన రికార్డులను ఆయన సృష్టించారు. బ్యాట్‌ పట్టినా, పట్టకపోయినా (ఫేస్‌బుక్‌లో) ఆయన రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు.చిరుప్రాయంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్‌ రికార్డులపై రికార్డులు సాధిస్తూనే ఉన్నారు. క్రికెట్‌ రంగంలో ఓ క్రీడాకారుడి జీవితంపై రూపొందిన పుస్తకం తొలి ప్రతికి రూ. 1.75 కోట్ల ధర పలకడం ఇదే మొదటిసారి. దీంతో ఈ పుస్తకం యావత్‌ ప్రపంచంలోనే అతి ఖరీదైన పుస్తకాల సరసన చేరింది.

 

కొత్త పుస్తకం విశేషాలు...

సచిన్‌పై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు మార్కెట్‌లో వెలువడ్డాయి. తాజా పుస్తకం 700 పేజీలతో 18 ఇంటూ 18 అంగుళాల కొలతలతో 1,000కిపైగా చిత్రాలతో రూపొందుతోంది. వీటిలో ఎన్నో అరుదైన చిత్రాలు, ఇప్పటి వరకూ బయటి ప్రపంచం చూడనివి ఉన్నాయి. వీటిలో అత్యధికం సచిన్‌ టెండూల్కర్‌ వ్యక్తిగత కలెక్షన్‌ కావడం విశేషం. ఈ పుస్తకంలో మూడు గేట్‌ఫోల్డ్స్‌ ఒక్కోటి 79 ఇంటూ 20 అంగుళాలతో ఉండడం మరో విశేషం. ఈ పుస్తకం రూపకల్పనలో భాగంగా చేపట్టిన ఫోటో సెషన్‌లో సచిన్‌ పాల్గొన్నారు. ఈ తరహా ఫోటో సెషన్‌లో ఆయన పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకాన్ని పరిమిత సంఖ్యలో ముద్రిస్తున్నారు. ప్రతీదీ హ్యాండ్‌ బౌండ్‌తో, ఫైన్‌ లెదర్‌తో కూడిన సిల్క్‌ కవర్‌ను కలిగి ఉంటుంది. డిజిటల్‌ వెర్షన్‌తో సహా విభిన్న వెర్షన్‌లలో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు.

 

ఈ పుస్తకం తయారీ ప్రక్రియ 95 శాతం దాకా పూర్తయినట్లు ఓపస్‌ మీడియా గ్రూప్‌ సీఈఓ కార్ల్‌ ఫోలర్‌ తెలిపారు. ఈ పుస్తకం ధరను ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు. ఈ పుస్తకంలో ఎన్నో ప్రత్యేకతలుంటాయని, సచిన్‌ కెరీర్‌లోని కొన్ని మధురాభూతుల చిత్రాలు ఉంటాయని చెప్పారు.

''సచిన్‌ తాను ఉపయోగించిన బ్యాట్లలో ఎనిమిదింటిని మాకు అందించారు. ఆ బ్యాట్ల లోని చెక్కను వేరు చేసి రెండు రెడ్‌ లెదర్‌ ముక్కల మధ్య చెక్క పీలికలను ఉంచి పేజ్‌మార్కర్‌గా రూపొందిస్తాం. దాన్ని తాకినప్పుడల్లా చరిత్రను తాకిన అనుభూతి కలుగుతుంది'' అంటూ పుస్తకంలోని ఓ ప్రత్యేకతను వివరించారు ఫోలర్‌.

 

సచిన్‌ ఫేస్‌బుక్‌ పేజీకి అభిమానుల తాకిడి అధికంగా ఉండడం కూడా ఫోలర్‌ను ఆనందభరితుడిని చేస్తోంది. ''ఆరు నెలల స్వల్పకాలంలోనే సున్నా నుంచి 50 లక్షలకు చేరుకోవడం విశేషం. ఇలాంటి విశేషం ఇంతకు ముందెన్నడూ చోటు చేసుకోలేదు. ప్రతీ నెలా సగటున కొత్తగా 1,50,000 మంది అభిమానులు ఈ పేజ్‌లో చేరుతున్నారు. ఫిబ్రవరి నాటికి ఫేస్‌బుక్‌లో సచిన్‌ పేజ్‌ భారత్‌లో నెం.1 స్థానానికి చేరుకోగలదన్నారు''.

 

100వ సెంచరీ పూర్తి కాగానే...

సచిన్‌ 100వ సెంచరీ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నట్లుగానే, ఈ పుస్తక ప్రచురణకర్తలు కూడా దాని కోసమే వేచి ఉన్నారు. అది పూర్తయిన కొద్ది నెలలకు ఈ పుస్తకం అందరికీ అందుబాటులోకి రాగలదన్నారు. ''మరో రెండు నెలల్లో సచిన్‌ 100వ సెంచరీని పూర్తి చేయగలడని భావిస్తున్నాం. చరితాత్మక సన్నివేశాల్లో అదొకటి కానుంది'' అన్నారు ఫోలర్‌.

 

హ్యాండ్‌ బౌండ్‌...

''ఈ పుస్తకాలన్నింటినీ హ్యాండ్‌ బౌండ్‌ చేయిస్తాం. మెషిన్‌ బైండింగ్‌ చేయించం. ప్రపంచంలో నేటికీ హ్యాండ్‌ బైండింగ్‌ను ఉపయోగిస్తున్న అతి కొద్ది ప్రచురణసంస్థల్లో మాది కూడా ఒకటి. మెషిన్‌ బైండింగ్‌ చేయిస్తే, హ్యాండ్‌ బౌండ్‌ అంత నాణ్యం రాదు'' అంటూ వివరించారు ఫోలర్‌.

 

ప్రముఖులచే రచనలు...

ఎంతో మంది ప్రముఖులు సచిన్‌పై తమ అభిప్రాయాలను ఈ పుస్తకం ద్వారా వెల్లడించనున్నారు. అరుదైన చిత్రాలు ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ కానున్నాయి. భారత్‌తో పాటు లండన్‌లో ఈ పుస్తకం కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్స్‌ చేయించినట్లు ప్రచురణ కర్తలు తెలిపారు. ఏడు అడుగుల పొడవైన పోరాయిడ్‌ కెమెరాతో సచిన్‌ టెండూల్కర్‌ను షూట్‌ చేశారు. ఈ కెమెరాను ఆపరేట్‌ చేసేందుకు ఏకకాలంలో ఏడు మంది అవసరమవుతారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫోటోగ్రాఫర్‌ జెనాన్‌ టెక్సేరియా ఈ ఫోటో సెషన్‌ను చేపట్టారు.

 

ఫేస్‌బుక్‌లో రెండోస్థానం

ఫేస్‌బుక్‌లో సచిన్‌ టెండూల్కర్‌కు 50 లక్షల మంది అభిమానులు ఉన్నారు. భారతదేశంలో బాగా ప్రజాద రణ పొందిన వ్యక్తిగత పేజీల్లో ఆయనది రెండవది. మొదటి స్థానంలో ఎ.ఆర్‌. రెహమాన్‌ నిలిచారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి